తెలంగాణ రాష్ట్ర సర్కారుకు మరో షాకింగ్ న్యూస్ అందింది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. తమ పలుకుబడి పెరిగేదని భావించిన రాష్ట్ర సర్కారుకు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆ షాక్ నుంచి గట్టెక్కి తమ లక్ష్యం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది టిఆర్ఎస్ సర్కారు. మరి సర్కారుకు తగిలిన షాక్ ఏంటబ్బా అనుకుంటున్నారా? చదవండి మరి...

సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం తెలంగాణ సర్కారు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. దానికోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. ఒకవైపు సిద్ధిపేట మెడికల్ కాలేజీకి చకచకా ఏర్పాట్లు జరుగుతుంటే.. సంగారెడ్డి మెడికల్ కాలేజీ ఏమైందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆందోళన బాట పట్టిన సంగతి మనకు ఎరుకైందే. అలాగే కరీంనగర్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తున్నారని కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ కూడా సర్కారును గట్టిగానే విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సిద్దిపేట మెడికల్ కాలేజీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. నోటికాడికి వచ్చిన ముద్ద నోట్లోకి పోకముందే కింద పడ్డది.

సిద్దిపేట మెడికల్ కాలేజీకి అనుమతిని నిరాకరిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్రానికి సిఫార్సు చేసింది. మెడికల్ కాలేజీకి అనుమతి వస్తుందని గంపెడాశతో ఉన్న తెలంగాణ సర్కారుకు ఎంసిఐ నిర్ణయం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. 2018- 19 సంవత్సరంలో 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన వినతిని ఎంసిఐ రిజెక్ట్ చేసింది. మెడికల్ కాలేజీ అనుమతి ఇవ్వాలంటే బోధనా సిబ్బంది కొరత ఉండకూడదన్నది ఎంసిఐ నిబంధన. కానీ సిద్దిపేట మెడికల్ కాలేజీకి 14 శాతం బోధనా సిబ్బంది కొరత ఉన్నట్లు ఎంసిఐ గుర్తించింది. అటానమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల బిల్డింగ్స్ నిర్మాణం ఇంకా పూర్తికాలేదని ఎంసిఐ పేర్కొంది.

తనిఖీ సమయంలో సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద ఆపరేషన్లు ఏవీ జరగలేదని కూడా ఎంసిఐ నివేదికలో పేర్కొంది. ఇలాంటి కీలకమైన లోపాలు ఉన్నందున.. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి ఇచ్చేది లేదని కేంద్రానికి ఎంసిఐ సిఫార్సు చేసింది. ఈ పరిస్థితుల్లో సిద్దిపేటలో నెలకొల్పబోయే మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో కాబట్టి మరోసారి ఎంసిఐ ని రిక్వెస్టు చేసుకునే వెసులుబాటు ఉంటుందని వైద్య వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఎంసిఐ ఏవైతే లోపాలు గుర్తించి సిఫార్సు చేసిందో వాటిని.. నిర్ణీత గడువులోగా సరిచేస్తామని హామీ పత్రం ఇస్తే అనుమతి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. తెలంగాణ సర్కారు సిద్దిపేట మెడికల్ కాలేజీ ఏర్పాటు విషయయంలో చాలా పట్టుదలగా ఉన్నట్లు చెబుతున్నారు. సిఎం కేసిఆర్, మంత్రి హరీష్ రావుకు సిద్దిపేటతో ఉన్న అనుబంధం రిత్యా వెనువెంటనే మరోసారి అప్పీల్ చేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు.