Asianet News TeluguAsianet News Telugu

మంత్రి మల్లారెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి గళం.. వారు ఏం చెబుతున్నారంటే..?

మేడ్చల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఒకేచోట భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరంతా మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా అసంతృప్తి గళం వినిపించారు.

medchal malkajgiri district brs mlas meets against minister malla reddy
Author
First Published Dec 19, 2022, 2:38 PM IST

మేడ్చల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఒకేచోట భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీకి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ సమావేశం సాగింది. జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో తలదూరుస్తున్నారని వారంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జిల్లా పదవులను మల్లారెడ్డి ఆయన అనుచరులకే ఇప్పించుకుంటున్నారని ఆరోపించారు. మల్లారెడ్డి వ్యవహరిస్తున్న తీరును సీఎం కేసీఆర్,  మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. 

ఈ భేటీ అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యేలు.. తమ నియోజవర్గాల్లో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లోని నాయకులకు ఆశించిన పదవులు రావడం లేదని.. పదవులన్నీ మేడ్చల్ నియోజకవర్గం నేతలకే వెళ్తున్నాయని ఆరోపించారు. 

భేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో జరిగిన  ఫంక్షన్‌కు తాము రాలేకపోయామని.. అందుకే ఈరోజు బ్రేక్ ఫాస్ట్ కోసం కలిశామని చెప్పారు. జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలం ఈ సమావేశానికి వచ్చామని తెలిపారు. నియోజవర్గాల్లో అభివృద్ది, పార్టీ పరిస్థితిపై కూడా ఈ  సందర్భంగా చర్చించినట్టుగా తెలిపారు. తమ నియోజకవర్గాలలో ఆశించిన పదవులు రాకపోవడంతో నాయకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పార్టీ కష్టపడి  పనిచేసేవారికి పదవులు దక్కడం లేదని.. దీంతో వారికి అన్యాయం  జరుగుతుందని చెప్పారు. 

మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి తమను పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేలంతా ఒకమాటపైనే ఉన్నామని చెప్పారు. ఇక, మార్కెట్ కమిటీల విషయంలో మంత్రి మల్లారెడ్డి తొందరపడి జీవో ఇప్పించారని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. 

అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ కార్యకర్తలు పలువురు పదవులు ఆశలు పెట్టుకున్నారని అన్నారు. తాము కూడా కొందరికి కమిట్‌మెంట్స్ ఇచ్చామని.. కానీ పదవులన్నీ ఒకే నియోజకవర్గానికే తరలివెళ్తున్నాయని చెప్పారు. అక్కడ ఎందుకు పదవులు వస్తున్నాయి.. ఇక్కడ ఎందుకు రావడం లేదని కార్యకర్తలు అడిగే పరిస్థితి ఉందన్నారు. ఈ అంశాలను సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 

సీఎం కేసీఆర్ నుంచి పిలుపు..!
తాజా పరిణామాల నేపథ్యంలో ఐదుగురు ఎమ్మెల్యేలకు కూడా సీఎం కేసీఆర్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం అందుబాటులో ఉండాలని వారికి సూచించినట్టుగా సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios