Asianet News TeluguAsianet News Telugu

Medaram Jathara : మీరు మేడారం జాతరకు వెళుతున్నాారా? అయితే ఈ రూట్స్ లో బెటర్ జర్నీ ఖాయం...

మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం వెళ్లాలని అనుకుంటున్నారా? రెండేళ్లకోసారి జనాల్లోకి వచ్చే సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అమ్మవార్లకు మొక్కులు చెల్లించాలని అనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. 

Medaram Sammakka Saralamma Jathara Route Map AKP
Author
First Published Feb 19, 2024, 2:54 PM IST

హైదరాబాద్ : గిరిజన కుంభమేళగా పిలుచుకునే మేడారం జాతర సర్వం సిద్దమయ్యింది. వనం లోంచి జనాల్లోకి ఆ సమ్మక్క, సారలమ్మలు వచ్చే శుభ గడియలు దగ్గరపడ్డాయి. ఆ జంపన్న వాగులో స్నానం చేసి... గద్దెల రూపంలో కొలువైన అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు మేడారం బాట పడుతున్నారు.  వనదేవతను నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించేందుకు తెలంగాణ నుండే అనేక రాష్ట్రాల ప్రజలు వస్తుంటారు. కానీ చాలామందికి మేడారంకు ఎలా వెళ్లాలి? ఎక్కడెక్కడి నుండి బస్సులు అందుబాటులో వుంటాయి? ప్రైవేట్ వాహనాల్లో అయితే ఎలా వెళ్లాలి? అసలు ఎలా వెళితే మంచిది? అనే ప్రశ్నలు మెదులుతుంటాయి. అలాంటి భక్తుల కోసమే ఈ సమాచారం....

హైదరాబాద్ నుండి : 

తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుండి మేడారం జాతరకు వెళ్లాలని అనుకునేవారు ఎక్కువగా చేరుకునేది హైదరాబాద్ కే. ఇక్కడి నుండే మేడారం వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి తెలంగాణ ఆర్టిసి హైదరాబాద్ నుండి మేడారంకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసింది. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు కూడా  మేడారంకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తున్నాయి. సొంత వాహనాల్లో వెళ్లేవారు కూడా హైదరాబాద్ నుండి ఈజీగా మేడారం చేరుకోవచ్చు.   

హైదరాబాద్ నుండి మేడారంకు వెళ్లాలంటే వరంగల్ హైవే ఎక్కాల్సిందే. భువనగిరి, ఆలేరు, జనగామ మీదుగా వరంగల్ కు... అక్కడి నుండి ములుగు, పసర, తాడ్వాయి మీదుగా చేరుకోవచ్చు. లేదంటే పసర నుండి నార్లాపూర్ మీదుగా సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు చేరుకోవచ్చు. ప్రైవేట్ వాహనాల్లో వేళ్లేవారు ఈ దారిలో ఎక్కువగా వెళుతుంటారు. 

కరీంనగర్ నుండి : 
 
కరీంనగర్ వైపునుండి మేడారం జాతరకు వెళ్లాలంటే రెండు దారులున్నాయి. ఒకటి హుజురాబాద్, పరకాల మీదుగా చేరుకుంటే మరోటి  పెద్దపల్లి, భూపాలపల్లి మీదుగా చేరుకునేది. ఎక్కువగా హుజురాబాద్ మార్గంలోనే భక్తులు ప్రయాణిస్తుంటారు. 

ఆంధ్ర ప్రదేశ్ నుండి :  

ఆంధ్ర ప్రదేశ్ నుండి కూడా సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు గిరిజనులు అధికంగా వస్తుంటారు. వీరు విజయవాడ నుండి మేడారం చేరుకుంటారు. నందిగామ, ఖమ్మం, ఇల్లందు మీదుగా లేదంటే భద్రాచలం, మంగపేట,ఏటూరు నాగారం, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకోవచ్చు. 

చత్తీస్ ఘడ్ మీదుగా : 

మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాల నుండి ఏ స్థాయిలో అయితే  గిరిజనులు  వస్తారో అదే స్థాయిలో చత్తీస్ ఘడ్ నుండి కూడా వస్తుంటారు. వీళ్లు వాజేడు గోదావరి బ్రిడ్జి మీదుగా ఏటూరు నాగారం, తాడ్వాయి, మేడారం చేరుకుంటారు. 

ఇక ఒడిషా, మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా మేడారం జాతరకు భక్తులు తరలివస్తుంటారు. ఉత్తరాది రాష్ట్రాల భక్తులు కూడా మేడారంలో కనిపిస్తుంటారు.వీరంతా ఎక్కువగా హైదరాబాద్ నుండే మేడారంకు చేరుకుంటారు. వరంగల్ నుంచి సుమారు 104 కిలో మీటర్లు, హైదరాబాద్ నుంచి సుమారు 238 కిలోమీటర్ల దూరంలో మేడారం వుంది. 

మేడారం రైళ్లు :

రోడ్డు మార్గంలోనే కాదు రైలు మార్గంలోనూ మేడారం వెళ్లవచ్చు. సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, ఘన్పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు తదితర ప్రధాన కేంద్రాల నుండి ప్రత్యేక రైళను ఏర్పాటుచేసింది రైల్వే శాఖ. 

హెలికాప్టర్ సర్వీస్ :

కేవలం రోడ్డు మార్గంలోనే కాదు.. ఇక పై ఆకాశ మార్గంలోనూ మేడారం వెళ్లడానికి ఏర్పాట్లు జరిగాయి. హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ ఆపరేటర్లు ఈ ట్యాక్సీ హెలికాప్టర్‌లను రంగంలోకి దించింది. హన్మకొండ నుండి హెలికాప్టర్ లో మేడారం చేరుకోవచ్చు. ఈ సర్వీస్ ఉపయోగించుకునే వారికి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం దక్కనుంది. ఈ హెలికాప్టర్ ట్యాక్సీ టికెట్ బుకింగ్ కోసం, ఇతర వివరాలు తెలుసుకోవడానికి 74834 33752, 04003 99999 నెంబర్లకు కాల్ చేయవచ్చు. లేదా.. ఆన్‌లైన్‌లో infor@helitaxi.com‌లో వివరాలు పొందవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios