medaram jatara 2022 : గద్దెలపైకి చేరిన నలుగురు దేవతలు.. మహాజాతర షురూ.. నేడు విద్యాసంస్థలకు సెలవు...

ములుగు జిల్లా మేడారం అడవి సమ్మక్క నామస్మరణతో మార్మోగింది. జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం గురువారం రాత్రి ఆవిష్కృతమైంది. లక్షలమంది భక్తుల పారవశ్యం, గిరిజన యువకుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికారులు లాంఛనాల మధ్య ఆదివాసీ పూజారులు, వడ్డెలు వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చారు. 

medaram jatara 2022 : sammakka-sarakka 2 days jatara started in warangal,Today local holiday for educational institutions

మేడారం : medaram జాతర సందర్భంగా చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల దాకా భక్తజనంతో కిటకిటలాడింది. Cilakalaguṭṭa నుంచి మేడారానికి సమ్మక్ ను తీసుకు వచ్చే క్రతువు గురువారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉద్విగ్నభరితంగా సాగింది.

ఉదయం నుంచే మొదలై..
సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ఏర్పాట్లు గురువారం ఉదయమే మొదలయ్యాయి. సమ్మక్క వడ్డెలు, పూజారులు ఉదయం ఐదున్నర గంటలకే మేడారం సమీపంలోని చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి కంకవనాలు (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు (కొత్త కుండలు) తెచ్చి గద్దెలపైకి చేర్చారు. తర్వాత  సాయంత్రం ఐదు గంటల సమయంలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై కి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం చిలకల గుట్టపైకి బయలుదేరారు. అప్పటికే చిలకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది.

భక్తులు సమ్మక్క వచ్చే దారి పొడవునా రంగురంగుల పట్నాలు, ముగ్గులతో నింపేశారు. సాయంత్రం 7 గంటల సమయంలో సమ్మక్క తల్లితో పూజారులు చిలుకల గుట్ట దిగడం ప్రారంభించారు. ఇది చూసి భక్తులు, శివసత్తుల పూనకాలతో ఊగిపోయారు. పూజారులు సిద్దబోయిన లక్ష్మణరావు, మహేష్, చందా బాబురావు, దూప వడ్డె నాగేశ్వరరావు అమ్మవారిని వడ్డె కొక్కెర కృష్ణయ్యకు అప్పగించాక మేడారం వైపు కదిలారు. ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాల ప్రకారం సమ్మక్కను ఆహ్వానిస్తూ ఆమె రాకకు సూచికగా ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి కాల్పులు జరిపారు.

వెంటనే చిలకలగుట్ట నుంచి మేడారం దాకా లక్షలాది మంది భక్తజనం సమ్మక్క నామస్మరణంతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ప్రభుత్వం తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్రెడ్డి సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు.

రక్షణ వలయం మధ్య…
ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల మధ్య సమ్మక్క ప్రతిరూపం మేడారం వైపు బయలుదేరారు. దారిపొడవునా భక్తులు అమ్మకు దండం పెట్టుకున్నారు. మొక్కల కోసం తెచ్చుకున్న ఒడిబియ్యం చల్లారు. సమ్మక్కను తీసుకు వస్తున్న బృందం అక్కడినుంచి ఎదుర్కోళ్ల పూజా మందిరం చేరుకుంది. అక్కడ వడ్డెలు, పూజారులు ఎదురుకోళ్లు జరిపించారు. సమ్మక్కకు సెలపెయ్యను బలి ఇచ్చారు. మేడారం ముఖద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకు వస్తున్న పూజారులకు స్వాగతం పలికారు. తర్వాత 09:19 గంటల సమయంలో గద్దెల పైకి తీసుకు వచ్చారు.

సమ్మక్క తల్లి గద్దెకు పైకి వచ్చినప్పటి నుంచి ప్రతిష్టించే వరకు గద్దల ఆవరణలో విద్యుత్ దీపాలను ఆపివేశారు. రహస్య పూజలు చేసిన అనంతరం రాత్రి 9.45 గంటల సమయంలో దీపాలను ఆన్ చేశారు. మొదట మేడారం వాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు.

కెసిఆర్ పేరిట బెల్లం బంగారం సమర్పణ..
గురువారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కావడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ పేరిట అమ్మవార్లకు బెల్లం బంగారం మొక్కు సమర్పించారు.  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా అమ్మవార్లకు సీఎం పేరు మీద బెల్లం సమర్పించారు.

నలుగురు దేవతలు.. నలుదిక్కులా మొక్కులు…
బుధవారం మేడారం గద్దెలకు సారలమ్మ, పగిడిద్దరాజు , గోవిందరాజులు రాగా… గురువారం సమ్మక్క తల్లిని ప్రతిష్టించారు. దీనితో మొత్తం నలుగురు దేవతలు గద్దెలపైకి చేరి మహాజాతర పూర్తిస్థాయిలో ప్రారంభమయింది. మొక్కలు సమర్పించేందుకు లక్షల మంది భక్తులు భారీగా తరలివచ్చారు. దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధ, గురువారాల్లో సుమారు 75 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రకటించారు. 

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా జనగామ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ శివలింగయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా నడుస్తాయని, ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ సెలవుకు బదులుగా మార్చి 12న రెండో శనివారం పనిదినంగా పాటించాలని తెలిపారు.

కేయూ పరిధిలో.. 
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను పురస్కరించుకుని శుక్రవారం కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ తో పాటు.. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, డిగ్రీ, పీజీ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి వెంకట్రాంరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 12వ తేదీ రెండో శనివారం రోజు పనిదినంగా నిర్ణయించినట్లు చెప్పారు. అధికారులు, ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు గమనించాలని పేర్కొన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios