మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై బుధవారం నాడు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. భూకబ్జాలపై వార్తలు రాసినందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఓ దినపత్రిక రిపోర్టర్ సంతోష్ ను బెదిరించినట్టుగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ విషయమై బాధితుడి తరపున జర్నలిస్టు సంఘాలు జిల్లా ఎస్పీని కలిసి బాధిత జర్నలిస్టుకు రక్షణ కల్పించాలని కోరాయి. సంతోష్ ను బెదిరించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కూడ  ఫిర్యాదు చేశాయి.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.ఐపీసీ 109, 448, 504,506 3(2) సెక్షన్ల కింద ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రహదారికి పక్కనే ఉన్న భూములు కబ్జాకు గురౌతున్న విషయమై వార్త రాసినందుకు తనను ఎమ్మెల్యే బెదిరించారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చంపుతానని కూడ బెదిరించాడని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.