మెదక్: మెదక్ జిల్లా అచ్చంపేటలో అసైన్డ్ భూముల కబ్జా జరిగిన మాట నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అసైన్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణపై విచారణ జరుగుతోంది. కొంత మంది తమకు నిన్న ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత ఆ విషయం మీడియాలో వచ్చిందని, ఆ వెంటనే తాము విచారణ ప్రారంభించామని హరీష్ చెప్పారు.

హరీష్ అచ్చంపేటకు వెళ్లారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఆరోపణలు చేసిన బాధిత రైతులతో ఆయన మాట్లాడారు. తాము నిన్న రాత్రే ప్రాథమిక విచారణ జరిపామని, భాకబ్జాలు జరిగినట్లు తేలిందని ఆయన చెప్పారు. ఇంకా విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు 

అసైన్డ్ భూములను లాక్కున్నారనే ఆరోపణపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు తాము ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. భూముల ఆక్రమణ చట్టపరంగా నేరమని ఆయన చెప్పారు 

అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో ఈటెల రాజేందర్ దాదాపు వంద ఎకరాల భూమి కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. అసైన్డ్ భూములను లాక్కున్నారని అంటున్నారు. దానిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించారు. దాంతో శనివారం ఉదయం విచారణ ప్రారంభమైంది. రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు అచ్చంపేట చేరుకుని విచారణ జరుపుతున్నారు.