Marwari Go Back controversy: తెలంగాణలో "మార్వాడీ గో బ్యాక్" ఉద్యమం ముదురుతోంది. స్థానిక వ్యాపారులు ఆగస్టు 18న అమనగల్లు బంద్ కు పిలుపునిచ్చారు. వ్యాపారుల ఆరోపణలు, రాజకీయ నాయకుల కామెంట్స్ మధ్య ఈ వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది.

Marwari Go Back controversy: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల "మార్వాడీ గో బ్యాక్" అనే నినాదం గట్టిగా వినిపిస్తోంది. ఈ ఉద్యమం నిజానికి సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో జరిగిన చిన్న సంఘటనతో మొదలైంది. పార్కింగ్ విషయంలో జరిగిన గొడవలో మార్వాడీ వ్యాపారులు ఓ దళిత యువకుడిపై దాడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అట్రాసిటీ కేసు నమోదు కావడంతో ఈ ఘటన పెద్ద దుమారమే రేపింది. గాయకుడు, రచయిత గోరేటి రమేష్ మార్వాడీల దోపిడీని విమర్శిస్తూ ఓ పాట పాడగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పాటతో ప్రేరణ పొందిన స్థానికులు పెద్ద ఎత్తున "మార్వాడీ గో బ్యాక్" ఉద్యమాన్ని చేపట్టారు.

అమనగల్లు వ్యాపారులు ఈ ఉద్యమానికి మద్దతుగా ఆగస్టు 18న బంద్‌కు పిలుపునిచ్చారు. కిరాణ, వస్త్ర, వర్తక సంఘాలు, స్వర్ణకార సంఘాలు కలిసి తమ దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక వ్యాపారులు మార్వాడీలు నాణ్యతలేని వస్తువులు అమ్ముతూ, స్థానిక మార్కెట్‌ను పరోక్షంగా దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నారు. మార్వాడీ దుకాణాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా స్థానిక యువతకు ఇవ్వకుండా, తమ ప్రాంతాల వారినే నియమించుకుంటున్నారని వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ రంగు.. మార్వాడీలకు మద్దతుగా బీజేపీ నేతలు

ఈ వివాదం పెద్దది కావడంతో రాజకీయ వర్గాలూ రంగంలోకి దిగాయి. బీజేపీ నేతలు బండి సంజయ్ కుమార్ తో పాటు ఆ పార్టీ మాజీ నేత రాజా సింగ్ మార్వాడీలకు మద్దతుగా మాట్లాడారు. "మార్వాడీ గో బ్యాక్" ఉద్యమం హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర అని వారు పేర్కొన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ, "మార్వాడీలు తెలంగాణను దోచుకోలేదు, వారు వ్యాపారాలు చేసి సంపదను సృష్టించారు. నిజమైన ముప్పు రోహింగ్యాలు, అక్రమ వలసదారుల వల్లే వస్తుంది" అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను ఈ ఉద్యమం వెనకున్నాయనే ఆరోపణలు చేశారు.

స్థానిక ఉపాధిపై ముప్పుగా పేర్కొంటున్న లోకల్ వ్యాపారులు

అమనగల్లు వ్యాపారుల ప్రకారం, గతంలో మార్వాడీలు కేవలం బంగారం, స్వీట్ షాపులు, హోల్‌సేల్ వ్యాపారాల్లో ఉండేవారని, ఇప్పుడు మాత్రం కిరాణా, నిర్మాణ సామాగ్రి, రెస్టారెంట్లు సహా అన్నివిధాలా వ్యాపారాల్లో విస్తరించారని చెబుతున్నారు. ఈ విస్తరణతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని, మార్వాడీలు తమ వస్తువులను ఒకరికి ఒకరు తక్కువ ధరకు అమ్ముకుంటూ స్థానికులను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫలితంగా చిన్న వ్యాపారులు నిలదొక్కుకోలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సామాజిక, రాజకీయ ప్రభావం

"మార్వాడీ గో బ్యాక్" నినాదం సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. #GoBackMarwadi హ్యాష్‌ట్యాగ్‌తో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. కొందరు దీన్ని స్థానికుల ఆవేదనగా చూడగా, మరికొందరు హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కూడా మార్వాడీలపై ఆరోపణలు చేస్తూ ఉద్యమానికి మద్దతు తెలిపారు. "మార్వాడీలు జీఎస్టీ కట్టడం లేదు, ఇక్కడ సంపాదించి డబ్బు గుజరాత్, రాజస్థాన్‌కు తరలిస్తున్నారు" అని ఆయన అన్నారు.

మొత్తంగా ప్రస్తుతం తెలంగాణలో "మార్వాడీ గో బ్యాక్" ఉద్యమం ముదురుతూ వస్తోంది. ఒకవైపు స్థానిక వ్యాపారులు తమ జీవనోపాధి క్షీణిస్తోందని ఆందోళన చెందుతుండగా, మరోవైపు బీజేపీ నేతలు దీన్ని కుట్రగా పేర్కొంటున్నారు. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.