నల్గొండ: తన కూతురిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడన్న కోపంతో ప్రణయ్ ని అతి దారుణంగా హతమార్చిన మిర్యాలగూడకు చెందిన మారుతిరావు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లో అతడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోగా ఉస్మానియా హాస్పిటల్ లో అతడి మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. అనంతరం అతడి స్వస్థలం మిర్యాలగూడకు మృతదేహాన్ని తరలించారు.

ప్రత్యేక పోలీస్ బందోబస్తు మధ్య మారుతిరావు మృతదేహాన్ని హైదరాబాద్ నుండి మిర్యాలగూడకు తరలించారు. అంబులెన్స్ కు చుట్టూ పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు సెక్యూరిటీ అందించారు. కొద్దిసేపటి క్రితమే మృతదేహం మిర్యాలగూడలోని అతడి స్వగృహానికి చేరుకుంది. 

read more  మారుతీ రావు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. : నివేదికలో ఏముంది

మారుతిరావు మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. అతడి భార్యను సముదాయించడం ఎవ్వరివల్ల కావడంలేదు. భర్తతో వున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. 

 ఆదివారం హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీ ఆర్యవైశ్య మహాసభ భవన్‌లో ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు మృతదేహాన్ని సైఫాబాద్ పోలీసులు పోస్టుమార్టం అనంతరం భార్య గిరిజకు అప్పగించారు. అనంతరం మారుతీరావు భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం నల్గొండ జిల్లా మిర్యాలగూడకు తరలించారు.

Also Read:మారుతీరావు సూసైడ్: గారెలు తిన్నాడు, విషం బాటిల్ ఎక్కడ?

అయితే అంత్యక్రియలు ఇవాళే జరుగుతాయా లేక సోమవారం జరుగుతాయా అన్న విషయం తెలియాల్సి ఉంది. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏం తేలిందనే విషయం కూడా బయటికి రాలేదు. అయితే సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... మారుతీరావు విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్థారించామని చెప్పారు. ఘటన తర్వాత ఆర్యవైశ్య భవన్‌లో క్లూస్ టీమ్ సాయంతో తనిఖీలు చేయించామని సీఐ తెలిపారు.

 ఘటనాస్థలిలో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రణయ్ హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బనాయించిన కేసుల ఒత్తిడి కారణంగా మనస్తాపానికి గురై మారుతీరావు బలవన్మరణానికి పాల్పడి వుంటారని తాము భావిస్తున్నట్లు సైదిరెడ్డి తెలిపారు.