బిడ్డతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోయిన వివాహితను కరీంనగర్ లేక్  పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌లోని కట్టరాంపూర్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల వివాహిత తన రెండేళ్ల పాపతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.

దీనిలో భాగంగా బుధవారం మానేరు డ్యాంలోకి దూకేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆమె కదలికలను గుర్తించిన పోలీసులు వెంటనే వివాహితను కాపాడి లేక్ ఔట్‌పోస్ట్‌కు తరలించారు.

అనంతరం ఆమె నివసించే ప్రాంతానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. తన భర్త, అత్త ఇద్దరూ కలిసి తను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని వారి వేధింపులు భరించలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు వివాహిత పోలీసులకు తెలిపింది.

అనంతరం వివాహిత, ఆమె కుమార్తెను స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డులను ప్రకటించారు.