తన భర్త తనకు కావాలంటూ... ఓ యువతి అత్తారింటి ఎదుట నిరసన చేపట్టింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన భరత్ అనే యువకుడు.. తన సమీప బంధువు రోజా గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. వారిని ఎదిరించి 2016లో కూకట్ పల్లిలోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లపాటు వీరి సంసారం సజావుగానే సాగింది. తర్వాత నుంచి భరత్.. భార్య రోజాని వేధించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో.. గత మూడునెలలుగా కనీసం ఇంటికి రావడం కూడా మానేసాడు. భర్త ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా ఆమెకు దొరకలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే.. అతను కొత్తపేట లక్ష్మీనగర్ లో నివసించే భరత్ తల్లిదండ్రుల దగ్గరి కి మాత్రం తరచూ వచ్చివెళ్తున్న విషయం రోజా కి తెలిసింది. దీంతో.. ఆమె ఈ రోజు అత్తారింటికి వెళ్లి.. తన భర్తను ఇవ్వాల్సిందిగా కోరింది.

వాళ్లు స్పందించకపోవడంతో ఆమె మహిళా సంఘాల సహాయంతో.. అత్తారింటి ఎదుట ఆందోళన చేపట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.