ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముత్యాల్లాంటి ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. సంసారం సాఫీగా సాగిపోతోందని భావిస్తుండగా.. అనుకోని కలకలం వారి సంసారంలో రేగింది. భర్త.. పరాయి స్త్రీ కి ఆకర్షితుడయ్యాడు. భార్య, బిడ్డలను పట్టించుకోవడం మానేసాడు. ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదేమిటని నిలదీసిన భార్యను వదిలించుకునేందుకు ప్రయత్నించాడు. బిడ్డలను తీసుకొని ఇంటి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన  వెంగళరావు నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం, జములపురానికి చెందిన తోట లక్ష్మి, అదే గ్రామానికి చెందిన కృష్ణశంకర్‌కు పరిచయం ఏర్పడడంతో ప్రేమించుకున్నారు. 2008 జనవరి 18న పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు.. రక్షణ, రక్షిత ఉన్నారు. 
రెండేళ్ల క్రితం అమీర్‌పేట మధురానగర్‌ సీ 82, 83 బ్లాక్‌లోని దివ్య రెసిడెన్సీలో అద్దెకు దిగారు. కొంతకాలం బాగానే ఉన్నారు. అతడికి ఓ యువతి పరిచయం అవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అప్పటి నుంచి ఇంట్లో కలహాలు ప్రారంభమయ్యాయి. భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం తట్టుకోలేని లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో అహం దెబ్బతిన్న కృష్ణ శంకర్.. భార్యకు తెలియకుండా బిడ్డలిద్దరినీ తీసుకొని పరారయ్యాడు. ఎంత వెతికినా ఆమెకు ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో.. బాధితురాలు భర్త ఇంటి ఎదుట ధర్నాకి దిగింది. పోలిసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.