కట్టుకున్న భర్తను, కన్న తల్లిదండ్రులను కాదనుకుంది. యువకుడు చెప్పిన మాయమాటలు నమ్మి...అతనితో లేచిపోయింది. 9ఏళ్లు గడిచిన తర్వాత .. తాను మోసపోయానన్న విషయం అర్థం చేసుకుంది. ఈ సంఘటన  నల్గొండ జిల్లా మఠంపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... దామరచర్ల మండలానికి చెందిన కుక్కల శైలజకు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్ల గ్రామానికి చెందిన శేఖర్‌తో 2009లో పెద్దలు వివాహం జరిపించారు. వీరికి ఓ బాబు. అదే గ్రామానికి చెందిన పులి ఉపేందర్‌ వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుక్కల శేఖర్‌, ఉపేందర్‌ పొలాలు పక్కపక్కనే ఉండటం.. రోజూ పొలం పనులకు వెళ్తున్న క్రమంలో కుక్కల శైలజకు ఉపేందర్‌కు పరిచయం ఏర్పడింది. 

2011లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శైలజను ఆమె కుమారుడుతో సహా హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. తొమ్మిదేళ్లు సహజీవనం చేసి న ఉపేందర్‌ రెండేళ్లుగా శైలజను దూరంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం దామరచర్ల మండలంలో ఉన్న సమయంలో రెండు, మూడు సార్లు శైలజతో గొడవ పడి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు. 

కాగా నాలుగు రోజుల క్రితం యాతవాకిళ్లకు శైలజను పంపిన ఉపేందర్‌ తనకు హైదరాబాద్‌లో డబ్బులు రావాల్సి ఉంది, వసూలు చేసుకుని వస్తానని చెప్పి, అప్పటి వరకు తన ఇంటి వద్దనే ఉండమని చెప్పి వెళ్లాడు. నాలుగు రోజులైన ఇంటికి రాకపోవడంతో  మోసపోయానన్న విషయం అర్థం చేసుకుంది. చేసేదిలేక.. తిరిగి భర్త, తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లలేక ప్రియుడు ఉపేందర్‌ ఇంటిముందు శైలజ  మౌనదీక్ష చేపట్టింది. శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.