మరో యువతి కిడ్నాప్ కి గురయ్యింది. తమ కుమార్తెను కిడ్నాపర్ రవి శేఖర్అపహరించినట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితం హయత్ నగర్ కి చెందిన సోని అనే యువతిని రవి శేఖర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.

కిడ్నాపర్ ఓ కారును దొంగతనం చేసి... ఆ కారులో యువతిని తీసుకుని పరారయ్యాడు. కాగా... మంగళవారం రాత్రి సోనిని ప్రకాశం జిల్లా అద్దంకిలో వదిలేసి వెళ్లిపోయాడు. నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ కథ ముగిసింది అనుకోగానే... మరో కిడ్నాప్ కేసు పోలీసుల ముందుకు వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నంద్యాలకు చెందిన నాగరాజు, అరుణ దంపతుల కుమార్తె ఊహాశ్రీని హైదారాబాద్‌లోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన నాగరాజు, శాంతమ్మ దంపతుల కుమారుడు మురళితో రెండేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లయిన కొద్ది రోజులకే మురళి ఉద్యోగరీత్యా ఖడ్తర్‌కు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఊహాశ్రీ అత్తమామల వద్దే ఉంటుండగా ఆరోగ్యం సరిగా లేక అత్త కొంత కాలం క్రితం చికిత్స నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది.

మామ నాగరాజుతో కలిసి ఊహశ్రీ హైదరాబాద్ లోని ఇంట్లోనే ఉంటోంది. గత నెల జూలై 5న మామ నాగరాజు ఉద్యోగరీత్య విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రాగా ఊహాశ్రీ కనిపించలేదు. సమీప బంధువులను విచారించినా ప్రయోజనం లేకపోవడంతో జీడిమెట్ల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఊహాశ్రీ కోసం తెలంగాణ పోలీసులు ఎంత గాలించినా ఫలింతం లేకపోవటంతో సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. గత నెల 9న ఒంగోలులో రవి శేఖర్ తో కలిసి చూసినట్లు అక్కడి స్థానికులు  చెప్పడం గమనార్హం. 

దీంతో ఆ సమాచారం మేరకు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టినా లభించకపోవడం గమనార్హం. భర్త, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా... అనుమానితుడు రవి శేఖర్ పోలీసుల అదుపులోనే ఉండటం గమనార్హం.