Asianet News TeluguAsianet News Telugu

విషాదం: 15 ఏళ్లకు ఒక్కటైన ప్రేమికులు.. కవలలకు జన్మనిచ్చి మరణించిన వివాహిత

రెండు మూడు రోజులకే ప్రేమజంటలు విడిపోవడమో లేదంటే పెద్దలను ఎదిరించి ఏ ఆర్యసమాజ్‌లోనో పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఏకంగా 15 సంవత్సరాల పాటు ప్రేమించుకుంటూ ఉండటంతో పాటు.. పెద్దల అనుమతి కోసం అన్నేళ్లు ఎదురుచూసింది ఓ ప్రేమజంట.. వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లి చేశారు

Married women died to the birth of the twins
Author
Hyderabad, First Published Oct 14, 2018, 11:03 AM IST

రెండు మూడు రోజులకే ప్రేమజంటలు విడిపోవడమో లేదంటే పెద్దలను ఎదిరించి ఏ ఆర్యసమాజ్‌లోనో పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఏకంగా 15 సంవత్సరాల పాటు ప్రేమించుకుంటూ ఉండటంతో పాటు.. పెద్దల అనుమతి కోసం అన్నేళ్లు ఎదురుచూసింది ఓ ప్రేమజంట.. వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లి చేశారు..

అన్యోన్యంగా సాగిపోతున్న వీరి దాంపత్యంలో అతని భార్య గర్భం దాల్చడంతో దంపతులు సంబరపడిపోయారు. నెలలు నిండిన తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి భార్య కన్నుమూయడంతో అతను గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. నాగోల్ డివిజన్‌లోని బండ్లగూడ శ్రీ ఇంద్రప్రస్థకాలనీకి చెందిన పంగులూరి రాకేశ్‌ తన ఇంటి ముందు నివసించే షకీరా బేగంలు డిగ్రీ చదివే నాటి నుంచి ప్రేమించుకుంటున్నారు.

ఇద్దరివి వేరు వేరు మతాలు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో షకీరా కుటుంబసభ్యులు తమ మకాంను ఉప్పల్‌కు మార్చారు. అయినా 15 ఏళ్ల నుంచి సాగుతున్న వీరి ప్రేమలో కొంచెం కూడా మార్పు రాలేదు. వీరి పట్టుదలను, ప్రేమలోని నిజాయితిని గుర్తించిన పెద్దలు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో గతేడాది డిసెంబర్ 3న వివాహం జరిపించారు.

షకీరా గర్భం దాల్చడంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఓ ఫైనాన్స్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తోన్న రాకేశ్.. భార్యను చూసుకోవడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. షకీరాను పరీక్షించిన వైద్యులు కవల పిల్లలు పుట్టబోతున్నారని చెప్పారు. ఎనిమిదో నెల ప్రవేశించగా ఆమెకు ఒంట్లో నలతగా ఉండటంతో గత గురువారం రాత్రి ఎల్బీ నగర్ సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు.

ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం శుక్రవారం విషమించడంతో అత్యవసరంగా శస్త్రచికిత్స చేశారు. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత షకీరా పరిస్థితి మరింత క్లిష్టంగా ఉందని వైద్యులు చెప్పడంతో వెంటనే సమీపంలోని మరో ఆసుపత్రికి తరలించారు.

అదే రోజు రాత్రి ఆమె గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలపడంతో రాకేశ్ కుప్పకూలిపోయాడు. భార్య తనను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో అతనిని ఓదార్చడం ఎవ్వరితరం కావడం లేదు. వీరి ప్రేమకు ఆ కవల పిల్లలే గుర్తుగా నిలవనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios