భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త ఆమెను హత్య చేసి అదృశ్యమైందంటూ అందరినీ నమ్మించేందుకు కట్టుకథలు చెప్పాడు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపూర్‌కు చెందిన సరితకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన ఇస్లావత్ రాజుతో వివాహమైంది.

ఆటోను నడుపుతూ రాజు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే పెళ్లయిన నాటి నుంచి సరితను ఆమె భర్త వేధిస్తూనే ఉన్నాడు. దీంతో విషయం పెద్దల దృష్టికి వెళ్లడంతో.. వారు పంచాయతీ పెట్టి దంపతులకు నచ్చజెప్పారు.

పోలీసులు కూడా రాజుకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో సరిత గర్భందాల్చడంతో శనివారం కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షాలు చేయించాడు.

అనంతరం భార్య సోదరికి ఫోన్ చేసి సరిత కనిపించడం లేదని చెప్పాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లిగూడ గేట్ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో పరిశీలించి.. సరిత బంధువులను పిలిపించారు. అక్కడ వారు ఆ మృతదేహం సరితదేనని నిర్ధారించారు..భర్తే హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటాడని వారు అనుమానం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత కందుకూరు పోలీస్ స్టేషన్‌లో రాజు లొంగిపోయాడు.

సరిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.