పెళ్లయిన ఆరేళ్లలో ఎప్పుడూలేనిది భర్త తనను అనుమానించడాన్ని తట్టుకోలేకపోయిన వివాహిత మనస్థాపంతో బాత్రూంలో షవర్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

నిర్మల్: ఆరేళ్ల క్రితం వారిద్దరికీ పెళ్లయింది... ఇద్దరు పిల్లలతో సంసారం సాఫీగా సాగుతోంది. ఇలా పిల్లాపాపలతో ఆనందంగా జీవిస్తున్న దంపతుల మధ్య అనుమానం చిచ్చుపెట్టింది. పెళ్లయినా ఈ ఆరేళ్లలో ఏనాడు లేనిది ఇద్దరు పిల్లల తల్లయ్యాక భార్యపై అనుమానం పెంచుకున్న భర్త వేధించసాగాడు. భర్త వేధింపులను భరించినా అనుమానించడాన్ని మాత్రం ఆమె తట్టుకోలేకపోయింది. ఇలా తీవ్ర మనస్థాపానికి గురయిన వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ (nirmal) పట్టణ సమీపంలోని మంజులాపూర్ గ్రామానికి చెందిన ప్రణీత-సాయికృష్ణ భార్యాభర్తలు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా వుండేవారు. వీరి ఆరేళ్ళ వివాహబంధం సాఫీగా సాగడంతో ఇద్దరు బిడ్డలు పుట్టారు. 

అయితే ఇటీవల భార్య ప్రణీతపై సాయికృష్ణ అనుమానం పెంచుకుని వేధించసాగాడు. ఇద్దరు పిల్లల భవిష్యత్ ను దృష్టిలో వుంచుకుని భర్త వేధింపులను భరిస్తూనే ఆమె గుట్టుగా కాపురం చేసింది. అయితే రోజురోజుకు భార్యపై అనుమానం మరింత పెరిగి పెనుభూతమై అసభ్యంగా తిట్టడం... ఇష్టంవచ్చినట్లు కొట్టడం చేయసాగాడు. ఇలా భర్త వేధింపులు మితిమీరిపోవడంతో ప్రణీత తట్టుకోలేకపోయింది. దీంతో దారుణ నిర్ణయం తీసుకుంది. 

మంగళవారం పండగపూట కూడా భర్త గొడవకు దిగడంతో ప్రణీత తట్టుకోలేకపోయింది. దీంతో స్నానానికని బాత్రూంలోకి వెళ్లిన ఆమె షవర్ కు ఉరేసుకుంది. ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు బద్దలుగొట్టి చూడగా ప్రణీత ఉరికి వేలాడి కనిపించింది. ఆమెను కిందకు దించి నిర్మల్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

తల్లి మృతదేహం వద్ద ఇద్దరు చిన్నారులు ఏడవడం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. భర్తతో పాటు అత్తింటివారే ప్రణీతను చంపారని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రూరల్ పోలీస్ స్టేషన్ ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ప్రణీత సోదరుడి ఫిర్యాదు మేరకు సాయికృష్ణతో పాటు అతడి తల్లి లక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇలా అనుమానం పచ్చని సంసారంలో చిచ్చుపెట్టి ఒకరి మృతికి కారణమయ్యింది. 

ఇదిలావుంటే విశాఖపట్నం జిల్లా (visakhapatnam district)లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలను హతమార్చి ఆ తర్వాత వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఉదంతం విశాఖ జిల్లా అనకాపల్లిలో కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మెట్టపేట గ్రామానికి చెందిన జనార్దనరావు తన అక్క కూతురు అనూషతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. జనార్ధన రావు అర్జ అచ్యుతాపురంలోని ఫార్మా కంపనీలో పని చేస్తున్నాడు. 

అనకాపల్లి రోడ్డు లోని ఒక ఇంట్లో ఏడు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. వీరికి సుదీక్ష (5), గీతాన్విక (1.5 సంవత్సరాలు) కుమార్తెలు. ఉద్యోగానికి సెలవు పెట్టి శనివారం స్వగ్రామం మెట్ట పేట వెళ్ళాడు. సోమవారం సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఫ్యాన్ కి భార్య అనూష ఉరేసుకుని ఉంది. కుమార్తెలు ఇద్దరు కింద పడి ఉన్నారు. వెంటనే 100కీ సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుమార్తెలు ఇద్దర్నీ చున్నీతో ఉరివేసి.. వారు చనిపోయాక అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

ఇద్దరు కుమార్తెలను చంపి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ను సేకరించారు. ఇది అనూష రాసిందేనా అని పరిశీలిస్తున్నారు. సూసైడ్ నోట్ లోని వివరాలు, మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు వివాహిత ఆత్మహత్య వెనుక ఇంటి యజమాని పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.