కరోనా భయంతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ధర్మపురి మండలంలోని బొంకూర్ గ్రామానికి చెందిన మాదాసు మల్లేశం, సత్తవ్వ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

వారిలో చిన్న కుమార్తె నారా మేఘన(22) భీఫార్మసీ పూర్తి చేసింది. కాగా.. రెండు నెలల క్రితం ఆమెకు మండల కేంద్రానికి చెందిన మధుసూదన్ అనే యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే.. పెళ్లి జరిగిన కొద్దిరోజులకు నూతన దంపతులు హైదరాబాద్ వెళ్లారు. ఇద్దరూ నగరంలోనే ఉద్యోగాలు చేసేవారు.

అయితే.. ఇటీవల మేఘనకి జ్వరం వచ్చింది. పరీక్షలు చేయగా.. కరోనా నెగిటివ్ గా తేలింది. అయితే.. తనకు వచ్చింది కరోనానే అని ఆమె బలంగా నమ్మింది. టైఫాయిడ్ వచ్చిందని.. కరోనా కాదని భర్త చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను తన పుట్టింటికి వెళతానని చెప్పడంతో.. పంపించాడు. అయితే.. పుట్టింటికి చేరిన మేఘన.. అందరూ నిద్రపోతున్న సమయంలో.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కరోనా వచ్చిందనే భయంతోనే మేఘన ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కాగా.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.