కట్టుకున్న భర్త కంటికి రెప్పలా కాపాడుకుంటాడని ఆమె కలలు కన్నది. కానీ.. ఆమె ఆశలన్నీ అడియాశలయ్యాయి. సరిగా చూసుకోకపోగా.. శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు ఆమె భరించలేకపోయింది. అంతే.. తన కన్న బిడ్డ సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్తూరు మండలం కొడిచర్ల తండాలో స్వర్ణ  (23) అనే వివాహిత, తన 14 నెలల కూతురితో కలిసి నీళ్ల క్వారీలోకి దూకింది. బంధువులు గుర్తించి, వెలికితీసేసరికి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. స్వర్ణకు నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. భర్త రాజు తరచూ వేధింపులకు గురిచేస్తుండడంతోనే బిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.

కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అచ్చం ఇలాంటి విషాద సంఘటనే మరోటి చోటుచేసుకుంది. రామాపురం గ్రామానికి చెందిన నవీనీత(23)కి మూడేళ్ల క్రితం మహేష్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. మహేశ్‌ వ్యవసాయం చేస్తూ డీజే నడుపుతాడు. వరకట్నంగా నవనీత తల్లిదండ్రులు రూ.10లక్షల కట్నం ఒప్పుకొని పెళ్లి సమయంలో రూ.6 లక్షలు ఇచ్చారు. సాగులో నష్టాలు, ఇతర సమస్యలతో ఆమె తల్లిదండ్రులు మరో రూ.4లక్షలు ఇవ్వలేకపోయారు.

కట్నంలో మిగతా మొత్తం తేవాలంటూ, పిల్లలు పుట్టడం లేదంటూ పెళ్లయిన ఆరు నెలల నుంచే భర్త, అత్తమామలు వేధించడం ప్రారంభించారు. గొడవలు ఎక్కువ కావడంతో నవనీత తల్లిదండ్రులు పెద్ద మనుషులను ఆశ్రయించారు. వారు, మహేశ్‌ను మందలించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. నవనీత ఈనెల 11వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసింది.  గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసింది.