కట్టుకున్న భార్య వుండగానే మరో మహిళపై కన్నేసి కటకటాలపాలయిన యువకుడు చివరకు ప్రాణాలనే తీసుకున్నాడు. ఈ దారుణం మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

మంచిర్యాల: కట్టుకున్న భార్య వుండగా మరో బాలికపై అతడి కన్ను పడింది. ప్రేమ పేరిట బాలిక వెంటపడుతూ వేధించడంతో కటకటాలపాలయ్యాడు. ఐదునెలలు జైల్లో వుండి ఇటీవలే విడుదలైన అతడి బుద్ది మాత్రం మారలేదు. బాలిక కోసమే వెతుకుతూ భార్యతో గొడవపడటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అటు బాలిక దక్కకపోవడం, ఇటు భార్య దూరమవడాన్ని భరించలేక పోయిన అతడు అతిగా మద్యం సేవించి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల పట్టణంలోకి హమాలీవాడలోసాయికృష్ణ(28)-సంధ్య దంపతులు నివాసముండేవారు. సాయికృష్ణ పోస్టాఫీస్ లో తాత్కాలిక పద్దతిలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇలా జీవితం ఆనందంగా సాగుతున్న సమయంలో సాయికృష్ణ ఓ బాలికపై మనసుపడ్డాడు. తనకు పెళ్ళయి ఇంట్లో భార్య వుందన్న విషయాన్ని మరిచిపోయి ఆకతాయిగా మారి ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంటపడుతూ వేధించేవాడు. 

అతడి వేధింపులను భరించలేక బాలిక విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా గతేడాది అక్టొబర్ 20న సాయికృష్ణ అరెస్టయ్యాడు. న్యాయస్థానం అతడికి జైలుశిక్షవిధించగా ఐదునెలల తర్వాత ఇటీవలే వారంరోజుల క్రితం బయటకువచ్చాడు. 

ఐదునెలల జైలుశిక్ష తర్వాత కూడా సాయికృష్ణలో ఏమాత్రం మార్పు రాలేదు. తప్పుచేసినప్పటికి భర్తతో కలిసి జీవించాలని భార్య సంద్య భావించింది. కానీ సాయికృష్ణ మాత్రం బాలిక ఫోటో పట్టుకుని వెతకసాగాడు. ఈ విషయం తెలిసి రెండురోజుల క్రితం భార్యాభర్తల మద్య గొడవజరిగింది. దీంతో ఇక భర్త మారడని భావించిన పుట్టింటికి వెళ్లిపోయింది. 

ఇలా తాను ఇష్టపడ్డ బాలిక దొరక్కపోవడం, కట్టుకున్న భార్య విడిచిపెట్టి వెళ్లడంతో సాయికృష్ణ తీవ్ర డిప్రెషన్ కు లోనయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం మంచిర్యాల శివారులో ఓ మూతపడిన సామిల్ లో మద్యం తాగుతూ కూర్చున్నాడు. ఇలా ఒక్కడే అతిగా మద్యం సేవించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో అక్కడే పోడిపోయిన సాయికృష్ణ కొంతసేపటికి ప్రాణాలు కోల్పోయాడు. 

మృతదేహాన్ని గమనించినవారు పోలీసులకు సమాచారం అదించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహం చుట్టుపక్కల మద్యం సీసాలు పడివుండటంతో అతిగా మద్యం సేవించడం వల్లే చనిపోయివుంటాడని భావిస్తున్నారు. సాయికృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.