హైదరాబాద్: కొద్ది నిమిషాల్లో జరుగాల్సిన పెళ్లి సినీ పక్కీలో ఆగిపోయిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పెళ్లికొడుకు తన ప్రేమించాడంటూ మరో యువతి ఈ పెళ్లిని అడ్డుకుంది. అలాగే పెళ్లికూతురు మైనర్ కావడంతో అధికారులు కూడా పెళ్లి జరక్కుండా అడ్డుకున్నారు. ఇలా పలు కారణాలతో పెళ్ళి అర్దాంతరంగా నిలిచిపోయింది. 

వివరాల్లోకి వెళితే... అడ్డగుట్టకు చెందిన ఓ యువతిని జనగాం జిల్లా యశ్వంత్ పూర్ కు చెందిన అనిల్ అనే యువకుడితో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ లోని ఓ చర్చిలో బుధవారం పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే మరికొద్ది నిమిషాల్లో ఈ ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యే సమయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుని పెళ్లి నిలిచిపోయింది. 

వరుడి గ్రామానికి చెందిన ఓ యువతి ఈ పెళ్ళిని అడ్డుకుంది. తనను ప్రేమించి ఇప్పుడు ఈ పెళ్లికి సిద్దపడ్డాడని ఆరోపించింది. ఇలా వివాదం సాగుతుండగానే పోలీసులు మరికొందరు ప్రభుత్వ అధికారులు అక్కడికి చేరుకుని పెళ్లికూతురు మైనర్ అని తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. తమకు అందిన సమాచారం నిజమేనని తెలుసుకున్న వారు కూడా పెళ్లి జరపడానికి అంగీకరించలేదు. 

ఇలా ప్రేమించానంటూ యువతి రావడం, పెళ్ళి కూతురు మైనర్ అంటూ అధికారులు తేల్చడంతో పెళ్లి అర్దాంతరంగా నిలిచిపోయింది. ప్రేమించిన యువతి అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.