కాంగ్రెస్‌కి గుడ్‌బై: బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిదర్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీలో బీజేపీలో చేరారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారంనాడు బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి శర్బానంద్ సోనేవాల్ మర్రి శశిధర్ రెడ్డికి బీజేపీ సభ్యత్వం అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , బీజేపీ నేతలు డాక్టర్ లక్ష్మణ్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్ , డీకే అరుణ, ధర్మపురి అరవింద్ సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మర్రి శశిధర్ రెడ్డికి కేంద్ర మంత్రి బీజేపీ సభ్యత్వం అందించారు. ఈ సందర్బంగా మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దె దించేవరకు తాను పోరాటం నిర్వహిస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తన తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు నిస్సిగ్గుగా టీఆర్ఎస్ మాట్లాడుతుందన్నారు. తెలంగాణకు తమ కుటుంబమే దిక్కు అనే ఆలోచనలో టీఆర్ఎస్ ఉందని చెప్పారు. తమ పార్టీని లక్ష్యంగా చేసుకొని టీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. .టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ తెలంగాణలో తన గోతిని తానే తవ్వుకుంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
ఇటీవలనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మర్రి శశిదర్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరించారు. మూడు రోజుల క్రితం మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయమై పార్టీ మాజీ చీఫ్ సోనియాగాంధీకి కూడా ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా ఆయన ఆ లేఖలో వివరించారు. కాంగ్రెస్ నేతల తీరుపై శశిధర్ రెడ్డి మండిపడ్డారు.