ములుగు: తెలంగాణలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ములుగు జిల్లాకు చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడొకరిని మావోయిస్టులు అతి దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. 

వివరాల్లోకి వెళితే... ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం భోదాపురం గ్రామానికి చెందిన మాడూరీ భీమేశ్వర్(48) టీఆర్ఎస్ నాయకులు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.  అయితే నిన్న(శనివారం) అర్ధరాత్రి  సమయంలో అతడు మావోయిస్టుల కాల్పుల్లో మృత్యువాతపడ్డాడు. 

అర్థరాత్రి భీమేశ్వర్ ఇంటికి వెళ్లిన మావో బృందం అతన్ని ఇంట్లోంచి బయటకు లాక్కుని వచ్చారు. తనను వదిలిపెట్టాలని ఎంత వేడుకున్నా వదిలిపెట్టకుండా తుపాకీతో కాల్చి అతి దారుణంగా హతమార్చారు. సంఘటనా స్థలంలో ఓ లేఖను కూడా వదిలివెళ్లారు మావోలు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ హత్యకు పాల్పడిన మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.