ఫోన్ స్విచ్చాఫ్ చేసినందుకు గాను మణుగూరు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిపై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఆగ్రహం వ్యక్తం చేయడం వల్లే ఇలా జరిగిందంటూ రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఖమ్మం జిల్లాలో (khammam district) అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అధికారులు నలిగిపోతున్నారు. ప్రజాప్రతినిధుల అనుచరుల ఒత్తిడి ఓవైపు.. విప్ రేగా కాంతారావు ఒత్తిడి మరోవైపు.. దీంతో ఎవరికి ఏం చెప్పాలో అర్ధంకాని పరిస్ధితుల్లో సతమతమవుతున్నారు ఉద్యోగులు. ఈ క్రమంలో మణుగూరు తహసీల్దార్ (manuguru tahasildar) చంద్రశేఖర్ రెడ్డి తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడం ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఆగ్రహం తెప్పించింది. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించారు జిల్లా కలెక్టర్.
ఆయన స్థానంలో బూర్గంపాడు తహసీల్దార్ నాగిరెడ్డికి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. దీంతో రెవెన్యూ సిబ్బంది అవాక్కయ్యారు. అధికార పార్టీ అనుచర గణం నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తోడు ఇటు ఎమ్మెల్యే నుంచి కూడా ఒత్తిడి పెరగడం వల్లే తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారని అంటున్నారు. అయితే దానిని ఎమ్మెల్యే తీవ్రంగా పరిగణించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానని అనడంతో అధికారులు బెంబేలేత్తుతున్నారు.
కాగా... కొద్దిరోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (bhadradri kothagudem) అశ్వాపురం మండలం మల్లెల మడుగులో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా జరిగిన ఘర్షణలు టీఆర్ఎస్ పార్టీలో అయోమయానికి గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. అశ్వాపురం మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంఎల్ఎ పాయం వెంకటేశ్వర రావు తో (payam venkateswarlu) పాటుగా మాజీ ఎస్ సి కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి (pidamarthi ravi), డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్యలు వచ్చారు. అయితే వారు వస్తున్న విషయానికి సంబంధించి తమకు సమాచారం ఇవ్వలేదని ఎంఎల్ఎ , విప్ , టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు (rega kantha rao) గుర్రుగా ఉన్నారు.
ప్రోటోకాల్ ప్రకారం తనకు చెప్పలేదని ఆగ్రహంతో ఉన్న రేగా మండలంలో 144 సెక్షన్ ను విధించేలా చేశారు. అయితే పొంగులేటి బృందం మల్లెల మడుగు గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు. అయితే పిడమర్తి రవి ఉద్యమ కాలంలో చేసినట్లుగానే మోటార్ బైక్ పై పోలీసుల కళ్లు గప్పి వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో రాళ్ల దాడితో పొంగులేటి వర్గానికి చెందిన వారు ఇద్దరు గాయపడ్డారు. దీంతో పోలీసులు పొంగులేటి వర్గానికి చెందిన పిడమర్తి రవిపై కేసులు నమోదు చేశారు.
అయితే.. ఈ వ్యవహారం టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. పొంగులేటి వర్గాన్ని దెబ్బ తీయడం కోసం దీనిని వినియోగించుకోవాలని చూస్తున్నారు. రేగా కాంతారావు ఇది అవకాశంగా తీసుకుని పొంగులేటిని పార్టీ నుంచి బయటకు పంపాలని ఎత్తుగడలు వేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. పొంగులేటిపై రేగా కాంతారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొంగులేటి పార్టీని వదలిపెట్టి, వేరే పార్టీలో చేరి పర్యటనలు చేపట్టాలని అంటున్నారు. అంతేకాదు ఈ దాడి అంతా అగ్రవర్ణాలు చేసినట్లుగానే ఉందని, ఆర్ఎస్ఎస్ ఎలాంటి దాడులు చేస్తుందో అదే తరహాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి దాడులు చేస్తున్నట్లుగా ఉందన్నారు రేగా . ఈ వ్యవహారాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఫిర్యాదు చేసి వారిని పార్టీ నుంచి పంపించే చర్యలను తీసుకుంటామని అంటున్నారు.
అటు.. రేగా కాంతారావుపై మాజీ ఎంఎల్ఎ పాయం వెంకటేశ్వర రావు కూడా మండిపడుతున్నారు. రేగా కాంతారావు కాంగ్రెస్ నుంచి గెలుపొంది ఆ పార్టీ నుంచి వచ్చిన పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లో చేరారని ఆరోపించారు. తమ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోవైపు పినపాక నియోజకవర్గంలో టిఆర్ఎస్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఇటు పొంగులేటి వర్గానికి చెందిన పాయం వెంకటేశ్వర్లను రాజకీయాలకు దూరం చేయాలని రేగా కాంతారావు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలో పాయంకు మద్దతు ఇస్తున్న పొంగులేటిపై కూడా విరుచుకుపడుతున్నారు.
