తెలంగాణలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణం జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది. పట్టణంలో ఏ వైపు చూసిన వరద నీరే కనిపిస్తుంది. 

తెలంగాణలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో పలు గ్రామాలు, పట్టణాలను వరద నీరు ముంచెత్తింది. జిల్లాలోని మంథని పట్టణం జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది. ఓ వైపు గోదావరి మరోవైపు బొక్కలవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మంథని పట్టణంలో ఏ వైపు చూసిన వరద నీరే కనిపిస్తుంది. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు చేరింది. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంథని పట్టణంలోని వ్యాపార సముదాయాల్లోకి చేరిన వరద నీరు చేరింది. మంథని శివారులో ఇటీవల ప్రారంభించిన మాతాశిశు ఆస్పత్రి పూర్తిగా నీటమునిగింది. రహదారులపై వరద నీరు చేరడంతో మంథని నుంచి పెద్దపల్లి, కరీంనగర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. వరదలో చిక్కుకుపోయినవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే మంథనికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు పట్ణంలో వరద నీరు చేరడంతో మంథనిలో 12 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు మంథని పట్ణణ శివార్లలో గోదావరి నది ఒడ్డున ఉన్న గౌతమేశ్వర స్వామి ఆలయంలో చుట్టూ వరద నీరు చేరింది. అయితే ప్రస్తుతం అక్కడ దాదాపు 20 మంది చిక్కుకుపోయినట్టుగా చెబుతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంథని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.

మంథనిలో బాహుబలి సీన్.. 
మంథనిలో వరదలు చిక్కుకున్న ప్రజలు ఎత్తైన భవనాలపైకి చేరకున్నారు. వర్షాల వల్ల వరద ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మర్రివాడలో వరద నీటిలో చిక్కుకున్న కుటుంబం.. సురక్షిత ప్రాంతానికి తరలివెళ్తున్న దృశ్యాలు బాహుబలి సినిమాలోని సీన్‌ను తలపించింది. ఓ వ్యక్తి కుటుంబంతో కలసి.. 3 నెలల చిన్నారిని బేసిన్‌ ఉంచి.. దానిని తలపెట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాడు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బ

మరోవైపు ఎగువన మహారాష్ట్రలో కూడా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నది పరివాహాక ప్రాంతాల్లోని పలు గ్రామాలు, పట్టణాలను వరద నీరు చేరింది. శ్రీరామ్‌ సాగర్, కడెం ప్రాజెక్టుల నుంచి ఎల్లంపల్లికి భారీగా వరద నీరు చేరడంతో.. అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లాలోని గోదావరి నది పరిహాక ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గోదావరిఖని సమీపంలోని వంతెనపై నుంచి వరదనీరు ప్రవహించడంతో.. వంతెనపై నుంచి రాకపోకలలను నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు బ్రిడ్జిపైకి ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. దీంతో గోదావరిఖని-మంచిర్యాలల మధ్య రాకపోకలు నిలిచిపోయింది.