హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ బుధవారం నాడు సాయంత్రం పార్టీ నేతలతో భేటీ కానున్నారు. పీసీసీకి కొత్త బాస్ ను ప్రకటిస్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకొంది.

కొత్త సంవత్సరంలో పీసీసీకి కొత్త బాస్ ఎవరనే విషయం తేలనుంది. అయితే పీసీసీ చీఫ్ ఎంపిక విషయం పార్టీ నాయకత్వానికి  కత్తిమీద సాముగా మారింది.

పీసీసీకి చీఫ్ ఎంపిక విషయంలో  ఇప్పటికే పార్టీకి చెందిన 165 మంది నుండి అభిప్రాయాలను ఠాగూర్ సేకరించారు. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ ను సోనియాగాంధీకి ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి మధ్య పీసీసీ చీఫ్  పదవి కోసం పరిశీలించారు.

కొంత కాలం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లు ప్రధానంగా విన్పించాయి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కల పేర్లు తెరమీదికి వచ్చాయి. అనూహ్యంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు పీసీసీ రేసులో  ఉంది.

also read::కొనసాగుతున్న సస్పెన్స్: టీపీసీసీ చీఫ్ కొత్త నేత ఎంపికకు తాత్కాలిక బ్రేక్

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మెన్ పదవికి ఖరారైందని ప్రచారం సాగింది. పీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిందనే ప్రచారం కూడ సాగింది.

మంగళవారం నాడే కొత్త పీసీసీ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారనే ప్రచారం కూడ సాగింది. అయితే మంగళవారం నాడు కొత్త పీసీసీ చీఫ్ అధ్యక్షుడి పేరును ప్రకటించలేదు.

ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్లతో మాణికం ఠాగూర్ సమావేశం కానున్నారు. పీసీసీకి కొత్త చీఫ్ ఎంపిక విషయమై ఠాగూర్  చర్చించనున్నారు.

రాష్ట్రానికి చెందిన నేతలతో చర్చించిన తర్వాత ఠాగూర్ సోనియాగాంధీతో ఠాగూర్ సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ పదవితో పాటు క్యాంపెయిన్ కమిటీ పదవులను రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టడం సరైంది కాదని కొందరు నేతలు పార్టీ నాయకత్వానికి సూచించారు. పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను నాగార్జునసాగర్ ఉప ఎన్నికల వరకు నిలిపివేయాలని కూడ కొందరు నేతలు కోరుతున్నారు