త్వరలోనే టీపీసీసీ చీఫ్ నియామకంపై ఓ అంచనాకు వస్తామన్నారు కాంగ్రెస్  తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేలా పటిష్టమైన జట్టును రూపొందిస్తామని ఆయన వివరించారు.

లీగ్ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఫైనల్ చేరి కప్ గెలవొచ్చని ఠాగూర్ వ్యాఖ్యానించారు. అదే తరహాలో 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పార్టీలో సీనియర్లకు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఎలాంటి విభేదాలు లేవని మాణిక్యం ఠాగూర్ తేల్చి చెప్పారు. నా అభిప్రాయం ముఖ్యంకాదని, పార్టీ అధినేత్రి సోనియా నిర్ణయమే ఫైనల్ అన్నారు.

Also Read:కాక రేపుతున్న టీపీసీసీ.. రేవంత్ టార్గెట్ గా అధిష్టానానికి హెచ్చరిక లేఖ..

సోనియాకు అన్ని విషయాలు తెలుసునని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. అధ్యక్షుడి ఎంపికపై కొంత మంది నేతలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు.

ఈ అభిప్రాయాలను సోనియాగాంధీకి ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో రాహుల్ తో రేవంత్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.