మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ హంతకులకు టీఆర్ఎస్ అండగా నిలుస్తోందని, వారి అండదండలతోనే ప్రణయ్ ని అతి దారుణంగా హత్య చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఇలాంటి పరువు హత్యలు భవిష్యత్తులో మరిన్ని జరగకుండా ఉండాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

తమ కులం వాడిని కాదని.. తక్కువ కులస్థుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకనే అక్కసుతో అమృత తండ్రి మారుతీరావు  అల్లుడు ప్రణయ్ ని దారుణంగా నడిరోడ్డుపై హత్య చేయించిన సంగతి తెలిసిందే. కాగా.. బాధిత కుటుంబాన్ని మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనంతరం హన్మకొండ వెళ్లిన ఆయన అక్కడ ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ లో ఈ విషయం గురించి మాట్లాడారు.

ప్రణయ్‌ హంతకులకు కఠిన శిక్ష పడుతుందని, బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారని అన్నారు. అధికార పార్టీ అండదండలను పొందడానికే అమృత తండ్రి మారుతిరావు కేటీఆర్‌ సమక్షంలోనే టీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. అంతేగాక మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పుట్టినరోజును పురస్క రించుకొని మంత్రితో పాటు తాను ఉన్న భారీ కటౌట్‌లను, ఫ్లెక్సీలను ప్రదర్శించారని చెప్పారు. ఎస్సీ కులానికి చెందిన ప్రణయ్‌తో తన కూతురు అమృత ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేకనే మారుతిరావు టీఆర్‌ఎస్‌కు దగ్గరై హత్య చేయించారని ఆరోపించారు. కేటీఆర్‌కు నిజాయితీ ఉంటే మారుతిరావును పార్టీనుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు మళ్లీ ట్వీట్‌ చేయాలని అన్నారు.

అధికార పార్టీ అండదండలు, ఆర్థిక బలంతో హత్యకు సూత్రదారులైన మారుతిరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌ శిక్షనుంచి తప్పించుకునే అవకాశం ఉందని, పాత్రదారులను కూడా కేసు నుంచి తప్పిస్తారని మంద కృష్ణ మాదిగ వివరించారు. ఎస్సీ యువకులు ఇతర కులాల యువతులను ప్రేమిస్తే వారి తల్లిదండ్రులు హత్య చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంత కాలంగా ఇలాంటి పరువు హత్యలకు సంబంధించి పత్రికల్లో ప్రచురితమైన క్లిప్పింగ్‌లను ఆయన విలేకరులకు చూపించారు. బాధిత కుటుంబాల పక్షాన నిలవాల్సిన అధికార పార్టీ నేతలు దోషులను కేసుల నుంచి తప్పిం చేందుకు యత్నిస్తున్నారని పలు ఉదాహరణల తో ఆయన వివరించారు.