చెన్నూరు: చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్టును తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు ఇవ్వకుండా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ  ఓదేలు అనుచరుడు గట్టయ్య ఆత్మహత్యాయత్నం చేశాడు.  ఈ ఘటనలో గట్టయ్యతో పాటు మరో  ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు కూడ వీరంతా ప్రస్తుతం హైద్రాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే  పెద్దపల్లి ఎంపీ సుమన్ పై హత్యాయత్నం చేశారని గట్టయ్యపై  పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 6 వ తేదీన కేసీఆర్ ప్రకటించిన  అభ్యర్థుల జాబితాలో  చెన్నూరు నుండి  ఓదేలుకు టిక్కెట్టు దక్కలేదు. ఓదేలు స్థానంలో  పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు టిక్కెట్టును కేటాయించారు.  అయితే  దీంతో ఓదేలు నిరసన వ్యక్తం చేశారు.

రెండు రోజుల క్రితం  కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే స్వీయ నిర్భంధంలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకొన్న కేసీఆర్  ఓదేలుకు ఫోన్ చేసి సెప్టెంబర్ 12వ తేదీన హైద్రాబాద్ లో అందుబాటులో ఉండాలని సూచించాడు.

అయితే ఓదేలు హైద్రాబాద్ లో వెళ్తుంగా  ఇందారంలో  సీసీరోడ్డు పనులను శంకుస్థాపన చేసే సమయంలో పెద్దపల్లి ఎంపీ  బాల్క సుమన్ పై  గట్టయ్య పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి విసిరేసేందుకు ప్రయత్నించాడని రామగుండం ఏసీపీ వెంకట్ రెడ్డి  చెప్పారు.  ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకట్ రెడ్డి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.

ఈ మేరకు ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ విశ్వంభర్ రెడ్డి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
గట్టయ్య తనతో పాటు తెచ్చుకొన్న పెట్రోల్ బాటిల్ ను  విసిరేసే క్రమంలో  ఇతరులపై కూడ పెట్రోల్ పడింది. పెనుగులాటలో గట్టయ్యపై ఎక్కువగా పడిందన్నారు. అయితే అక్కడే దీపం ఉండడంతో మంటలు వ్యాపించి  ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. సీఐ కూడ ఈ ఘటనలో గాయపడినట్టు ఆయన గుర్తు చేశారు.

గట్టయ్య ఆత్మహత్యయత్నం చేశాడా... సుమన్ పై పెట్రోల్ పోసేందుకు వచ్చాడా అనే విషయమై  దర్యాప్తులో తేలుస్తామన్నారు.  అయితే ప్రస్తుతం విశ్వంభర్ రెడ్డి పిటిషన్ ఆధారంగా  విచారణ చేస్తున్నట్టు చెప్పారు.

గట్టయ్య సహా మరో ఐదుగురు కార్యకర్తలకు గాయాలైన విషయాన్ని తెలుసుకొన్న ఓదేలు  హైద్రాబాద్ కు వెళ్లకుండానే  చెన్నూరుకు తిరిగి వచ్చారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించారు. ఇదిలా ఉంటే  కార్యకర్తలు  చావు బతుకుల మధ్య ఉంటే సుమన్  శవ రాజకీయాలు చేస్తున్నారని ఓదేలు మండిపడ్డారు.  తాను ఎవరికీ కూడ సుమన్ ప్రచారాన్ని అడ్డుకోవాలని చెప్పలేదని ఓదేలు చెప్పారు.