జోరున వర్షం.. మత్య్సకారులతో కలిసి చేపలు పట్టిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (వీడియో)
కరీంనగర్ జిల్లా మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించిపోగా.. వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పరిస్ధితి దారుణంగా వుంది. పరిస్ధితుల నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు శనివారం వరకు సెలవులను పొడిగించింది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార యంత్రాంగం జిల్లాల్లోనే వుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు. వివరాల్లోకి వెళితే.. మానకొండూరు మండలంలోనీ పలు గ్రామాలలో లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు బాలకిషన్. అనంతరం తిరిగి వెళుతుండగా మానకొండూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద కొందరు మత్స్యకారులు చేపలు పడుతుండటాన్ని ఆయన గమనించారు. దీంతో ఎమ్మెల్యే కూడా జాలర్లతో కలిసి చేపలు పట్టారు. అనంతరం రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. వర్షంలో మత్తడి పడుతున్నప్పుడు చేపలను పట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. బాలకిషన్ వెంట కరీంనగర్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, జెడ్పిటిసిల సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్ గౌడ్ తదితరులు వున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.