హైదరాబాద్:భారీ వర్షాలతో హైద్రాబాద్ నగరంలో జన జీవనం అస్తవ్యస్తమైంది.లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీళ్లు  చేరాయి. వరద నీటిలో హైద్రాబాద్ పాతబస్తీలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆయనను కాపాడేందుకు స్థానికులు  ప్రయత్నించారు. కానీ  ఫలితం లేకుండా పోయింది.

పాతబస్తీ ప్రాంతంలోని పల్లె చెరువు పూర్తిగా నిండిపోయింది. ఈ చెరువు అలుగు పోసింది. వరద నీరు రోడ్ల వెంట వెళ్తోంది. ఈ క్రమంలోనే వరద నీటిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. వరద ఉధృతికి  ఆ వ్యక్తి నీటి ప్రవాహంలో చేతికి ఏదైనా దొరుకుతోందోనని ప్రయత్నించాడు. కొందరు ఆయనకు ట్యూబ్ నీళ్లలో వేశారు.  కానీ ఆయనకు అది దొరకలేదు.

నీటి వేగాన్ని ఎవరూ కూడ అందుకోలేకపోయారు.  తాళ్లు వేసి ఆయనను కాపాడేందుకు కొందరు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీ వర్షాల కారణంగా నగరంలో సుమారు 15 మంది ప్రాణాలను కోల్పోయారు.

భారీ వర్షాలు, వరదలతో ముసారాంబాగ్ బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది. రెండు వైపులా ఉన్న ఐరన్ ఫెన్సింగ్ కొట్టుకుపోయింది.

రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్ మూసారాంబాగ్ ప్రాంతాన్ని పరిశీలించారు.