ప్రేమించానంటూ సదరు యువతి వెంట పడ్డాడు. ఆమె లేకుంటే తాను బతకలేనన్నాడు. సదరు యువతికి ఆమె తల్లిదండ్రులు వేరే పెళ్లి చేయాలనుకుంటే.. ఆ పెళ్లిని కూడా అతనే అడ్డుకున్నాడు. ఆమె తల్లిదండ్రుల కాళ్ల మీదపడి ఒప్పించి పెళ్లిచేసుకున్నాడు. అంతలా వెంటపడి చేసుకున్న అతను.. పెళ్లి తర్వాత మాత్రం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన వేములవాడలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వేములవాడలోని కోనరావుపేట మండలానికి చందిన అజయ్, సిరిసిల్ల మండలం పెద్దూరుకి చెందిన రాణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అజయ్.. రాణి తల్లిదండ్రుల కాళ్ల మీద పడి మరి పెళ్లికి ఒప్పించాడు.  అజయ్, రాణిలు ఆగస్టు 12న నిజామాబాద్‌లోని హనుమాన్‌ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

అయితే.. అజయ్ ప్రేమను అతని తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో.. రాణిని చిత్ర హింసలకు గురిచేసేవారు. నిత్యం కులం పేరుతో దూషించేవారు. ప్రతిరోజూ ఇంటి, పొలం పనులు చేయిస్తూ పస్తులుంచేవారు. వారి వేధింపులు తీవ్రం కావడంతో రాణి తల్లి ఈ నెల 14న ఆమెను ఇంటికి తీసుకెళ్లింది. తిరిగి మంగళవారం కొలనూర్‌కు వస్తే అజయ్‌ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో రా ణి అత్తవారింటి ఎదుట బైఠాయించింది. బాధితులరాలికి మహిళా సంఘాలు, గ్రామస్తులు మద్దతు తెలిపారు. ప్రజాప్రతినిధులు, పోలీసులు తనకు న్యాయం చేయాలని రాణి వేడుకుంటోంది.