నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొవాలని కుటుంబంతో సహా అత్తారింటికి వెళ్లాడు. ఆనందంగా సంబరాలు కూడా చేసుకున్నాడు. కానీ ఆ సంబరాలు ఎక్కువ సేపు మిగల్లేదు. అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఎల్బీనగర్ కి చెందిన కిన్నెరస్వామి(35) డ్రైవర్ గా పనిచేసేవాడు. పది సంవత్సరాల క్రితం అతనికి రామాంతపూర్ లోని కామాక్షిపురం ప్రాంతానికి చెందిన రమాదేవీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. కాగా... డిసెంబర్ 31వ తేదీన కిన్నెర స్వామి తన భార్యతో కలిసి న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు అత్తారింటికి వచ్చాడు.

బుధవారం ఉదయం కిన్నెర స్వామి తన కుటుంబసబ్యులతో కలిసి గుడికి వెళ్లాడు.  దేవాలయానికి వెళ్లివచ్చిన కొద్ది సేపటికే అతను ఇంట్లో కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా స్వామి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడి సోదరుడు శ్రీనివాస్‌ ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.