ఓ వ్యక్తి పక్కింటి కోళ్లను దొంగిలించడం మొదలు పెట్టాడు. మొదట దొంగ ఎవరో కనుక్కోలేకపోయిన సదరు కుటుంబీకులు... సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా పట్టుకున్నారు. దీంతో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ : కోళ్ల దొంగతనం బయటపడిందని ఓ వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ ఐదురోజుల తరువాత బుధవారం మృతి చెందాడు. షాకింగ్ గా ఉన్న ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామంలో 42యేళ్ల ఓ వ్యక్తి ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
వై.శ్రీనివాసరావు అనే వ్యక్తి ఓ ఇంట్లోనుంచి కోళ్లు దొంగతనం చేయడం సీసీ టీవీలో రికార్డయ్యింది. ఆ వీడియోను గ్రామస్తులందరూ చూశారు. దీంతో తన విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోయిందని.. తాను దొంగగా అవమానాలు పొందాల్సి వస్తుందనుకున్న వై.శ్రీనివాసరావు.. పురుగులమందు తాగాడు. అది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ మృతిచెందాడు.
రెండో పెళ్లి చేయడం లేదని తల్లిని గొడ్డలతో నరికి చంపాడు..
దీనిమీద పోలీసులు మాట్లాడుతూ.. "రావుకు సంబంధించిన సిసిటివి ఫుటేజీ ఉన్నమాట నిజమే, అయితే అతను దీనివల్లే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైనా కారణమా.. అనేది మేము ఖచ్చితంగా చెప్పలేం..’ అని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అంతేకాదు రావు అనే సదరు వ్యక్తిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పెనుబల్లి పోలీసులు తెలిపారు. ఇది పెట్టీ కేసు కావడంతో వై.శ్రీనివాసరావు, ఫిర్యాదుదారుడు మధ్య సర్దుబాటు జరిగింది. దొంగిలించిన కోళ్లను తిరిగి ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది... అని తెలిపారు.
అసలేం జరిగిందంటే... గ్రామంలోని ఒక కుటుంబం కోళ్లు తరచుగా తప్పిపోతున్నాయి. ఇది గమనించిన కుటుంబం.. దానికి కారణం కనిపెట్టడానికి ప్రయత్నించింది. దీనికోసం ఓ కుక్కను కూడా పెంచుకున్నారు. అయినా దొంగతనాలు ఆగలేదు. ఇలా జరగడానికి కారణం ఏంటి అనేది కనిపెట్టడానికి సీసీ టీవీ కెమెరాను ఫిక్స్ చేశారు.
దీంట్లో దొంగతనం చేస్తూ శ్రీనివాసరావు పట్టుబడ్డాడు. దీంతో దొంగ అతనే అని గుర్తించి సీసీటీవీ ఫుటేజీ ఆధారాలతో విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేశారు. దీంతో ఆందోళనకు గురైన శ్రీనివాసరావు ఇంత పని చేశాడని గ్రామస్తులు అంటున్నారు.
