నాగర్ కర్నూలు: తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. మహిళ శవంతో మూడు రోజుల పాటు ఓ వ్యక్తి సహవాసం చేశాడు. ఆ తర్వాత శవాన్ని పూడ్చి పెట్టడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో విషయం వెలుగులోకి వచ్చింది. 

ఆ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవుసలికుంటలో జరిగింది. తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెదిన కృష్ణయ్య తన కూతురు కళమ్మను 20 ఏళ్ల క్రితం అవుసలికుంటకు చెందిన శేఖర్ కు ఇచ్చి వివాహం చేశాడు. పెళ్లయిన పది నెలలకే శేఖర్ మరణించాడు. 

గాంతో కళమ్మను నాగనూలుకు చెందిన బాలపీరుతో రెండో వివాహం చేశాడు. వారికి ముగ్గురు సంతానం. కొన్నేళ్ల తర్వాత రెండో భర్త కూడా మరణించాడు. దాంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే ఇటీవల తండ్రి ఆమెను తీవ్రంగా మందలించాడు. 

మనస్తాపానికి గురైన కళమ్మ అవుసలికుంటలో ఒంటరిగా ఉంటున్న మొదటి భర్త తమ్ముడు లింగస్వామి ఇంటికి వచ్చింది. అప్పటికే తీవ్ర అనారోగ్యానికి గురైన కళమ్మ గురువారం మధ్యాహ్నం హఠాత్తుగా మరణించింది. దాంతో తనపైకి వస్తుందనే భయంతో లింగస్వామి విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. 

శనివారంనాడు గుడిసె ముందు గుంత తీసి శవాన్ని పూడ్చి పెట్టేందుకు గ్రామంలో మరో వ్యక్తి సాయం కోరాడు. ఈ ఘటనతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.