ఇటీవల రెండు రోజుల క్రితం ఓ పెళ్లి కొడుకు ఫంక్షన్ హాల్ లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా... ఈ హత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బంధువులే తమ కుమారుడి మృతికి కారణమంటూ వరుడు సందీప్ తండ్రి ఆరోపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... మలక్‌పేటకు చెందిన రిటైర్డ్‌ లెక్చరర్‌ నక్కెర్తి శ్రీనివాస్‌చారి, పద్మజ రాణిల కుమారుడు సందీప్‌(24). చిన్నతనంలోనే సందీప్‌ తల్లి మృతి చెందింది. దీంతో శ్రీనివాస్‌చారి రెండో వివాహం చేసుకోవడంతో సందీప్‌ చిన్నతనం నుంచి తాతయ్య జాగేశ్వరరావు వద్ద పెరిగాడు. జాగేశ్వరరావు కూడా సందీప్‌కు తన తల్లి లేని లోటు తెలియనివ్వకుండా పెంచాడు. 

బీటెక్‌ వరకు చదువుకున్న సందీప్‌కు బోయిన్‌పల్లికి చెందిన ఓ యువతితో ఏప్రిల్‌ నెలలో నిశ్చితార్థం చేశారు. అయితే చిన్నప్పటినుంచి తనను అల్లారుముద్దుగా పెంచిన తాతయ్య జాగేశ్వరరావు నెలక్రితం మృతి చెందడంతో సందీప్‌ బాగా కుంగిపోయాడు. తాతయ్య చనిపోయి నెల కూడా గడవకుండానే తనకు పెళ్లి ఏమిటంటూ వ్యతిరేకిస్తూ వచ్చాడు. అయినప్పటికీ పెద్దలు ఈనెల 10న కొంపల్లి టీ–జంక్షన్‌లో ఉన్న శ్రీకన్వెన్షన్‌లో పెళ్లి నిశ్చయించారు. 

కాగా.. పెళ్లి కొడుకుని చేసే విషయంలో తండ్రీ, కొడుకులకు మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. కాగా... మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన సందీప్.. ఫంక్షన్ హాల్ లోని తన గదిలోకి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వివాహ వేడుకలకు సిద్ధం చేసేందుకు సందీప్‌ గది తలుపును తట్టగా ఎంతకీ స్పందన లేదు.

దీంతో మాస్టర్‌ కీ తో తలుపులు తెరిచి చూడగా సీలింగ్‌కు వేలాడుతూ సందీప్‌ కనిపించాడు. వెంటనే సందీప్‌ను సుచిత్ర సర్కిల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా..అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

కాగా.. సందీప్ మృతిపై అతని తండ్రి సంచలన ఆరోపణలు చేశాడు. పెళ్లి కొడుకు సందీప్‌ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయంటూ అతను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్‌ చిన్నమ్మలు మాధవి, శారదలతో పాటు సందీప్‌ బాబాయ్‌ నాగరాజు, సందీప్‌కు సోదరుడి వరసైన శశాంక్‌లపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఫిర్యాదు స్వీకరించిన పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై సీఐ మహేశ్‌ స్పందిస్తూ సందీప్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఉందని, అతని ఫోన్‌ కాల్‌ డేటాను విశ్లేషిస్తే మరిన్ని వివరాలు వెల్లడవుతాయన్నారు. అప్పటి వరకు ఏ విషయాన్ని నిర్ధారించలేమన్నారు.