హైదరాబాద్: వావివరుసలు మరిచి కన్నకూతురినే కాటేసిన ఓ వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించింది. కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన అతనికి సైబరాబాద్ ఎంఎస్ జె కోర్టు కఠిన కారాగార శిక్ష వేసింది. 

వివరాలు ఇలా ఉన్నాయి... తల్లిని కోల్పోయిన ఓ పదేళ్ల బాలిక సోదరుడితో కలిసి జీవిస్తోంది. తండ్రి రెండేళ్లుగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వస్తున్నాడు. దీంతో బాలిక బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. 

తండ్రి బెదిరించడంతో జరిగిన విషయాన్ని బాధితురాలు ఎవరికీ చెప్పలేదు. 2014లో రాఖీ పండుగ సందర్భంగా కూతురిని ఇంటికి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని బాలిక ఉపాధ్యాయుడికి చెప్పింది. అతను విషయాన్ని పిల్లల సంరక్షణ కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లాడు. 

బాలికను ఆ కేంద్రానికి పంపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసి పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆ తర్వాత దర్యాప్తు అధికారి అయిన ఎసిపి హరికృష్ణ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.