భార్యభర్తల బంధం విడదీయలేనిది అని పెద్దలు చెబుతుంటారు. ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా.. ఒకరి కోసం మరొకరు ప్రాణాలు ఇవ్వగలిగే బంధం ఇది. ఇదే విషయాన్ని ఓ వ్యక్తి నిజం చేశాడు. భార్య మీద తనకున్న ప్రేమకు తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. 

భార్య ప్రాణాలు కాపాడే క్రమంలో  ఓ భర్త ప్రాణాలు కోల్పోయాడు.  ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

AlsoRead పొలం విషయంలో గొడవ.. మహిళను స్థంభానికి కట్టేసి... చెప్పులతో కొట్టి..

పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌ జిల్లా, శంకర గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌(42) ఉప్పుగూడలో నివసిస్తూ చెప్పులు కుట్టుకొని జీవిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఫలక్‌నూమా - ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల మధ్య కందికల్‌గేటు సమీపంలో భార్య సరితతో కలిసి పట్టాలు దాటుతున్నాడు. 

ఎంఎంటీఎస్‌ రైలు వేగంగా రావడాన్ని గమనించి భార్యను పక్కకు తోసేశాడు. అంతలోనే రైలు అతడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాళ్లపై పడిపోయిన సరితకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.