కుమార్తె స్నేహితురాలంటే బిడ్డలాంటిదనే ఇంగితం మరిచిన ఓ వ్యక్తి,. సదరు యువతిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను తల్లిని చేశాడు. వివరాల్లోకి వెళితే..  నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గడియగౌరారం గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫ్ హాలీమ్ తయారు చేయడంలో నిపుణుడు.

అతని కుటుంబం గతంలో బొగ్గుల కుంటలో నివసించేది. ప్రస్తుతం ఆయన బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో ఉంటున్నారు. బొగ్గులకుంటలో ఉన్నప్పుడు అతని కుమార్తె స్నేహితురాలు.. అప్పుడప్పుడు ఇంటికొచ్చి ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకునేవారు.

ఆమెపై షరీఫ్‌ కన్ను పడింది.. ఈ క్రమంలో ఓ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రలకు తెలియడంతో వారు నిందితుడిని నిలదీయడంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు.

ఆ తర్వాత దానిని నిలబెట్టుకోలేదు... ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం బాధితురాలు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు షరీఫ్‌పై ఒత్తిడి పెంచడంతో షరీఫ్ సోదరుడు మహ్మద్ చాంద్ బాధిత కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.

దీంతో బాధితులు ఫలక్‌నూమా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షరీఫ్, చాంద్‌లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.