తన భార్య తనకు కావాలంటూ ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ముందున్న హోర్డింగ్ టవర్ ఎక్కి మరీ నానా హంగామా చేశాడు.  కుటుంబ తగదా విషయంలో కమిషనరేట్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చి పోలీసులకు కూడా చుక్కలు చూపించాడు. తనను వదిలి పుట్టింటికి వెళ్లిన భార్యను రప్పించాలంటూ పోలీసులను కోరాడు. అయితే.. తనకు పోలీసులు సహకరించడం లేదంటూ ఆందోళన చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే..  మైలార్ దేవ్ పల్లి ప్రాంతానికి చెందిన బెల్లంపల్లి రాజు(38)కు 12ఏళ్ల క్రితం చాంద్రాయణగుట్ట కు చెందిన భాగ్య అనే మహిళతో పెళ్లయ్యింది. వీరికి  ఇద్దరు కుమార్లెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా.. రాజు రోజూ మద్యం సేవించి భార్యను చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు. దీంతో.. గత కొంతకాలంగా దంపతుల  మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు పెద్దవి కావడంతో.. భాగ్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది.

దీంతో.. తన భార్య తన ఇంటికి వచ్చేలా చేయాలంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు తన బాధ పట్టించుకోవడం లేదంటూ హోర్డింగ్ టవర్ కి దూకుతా నంటూ బెదిరించాడు. పోలీసులు ఎంత ప్రయత్నించినా రాజు కిందకు దిగకపోవడంతో.. అతని భార్యను రప్పించాల్సి వచ్చింది. భార్య అక్కడికి రావడంతో రాజు కిందకు దిగి వచ్చాడు.