హైదరాబాద్ మరో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తన చెల్లిని ప్రేమ పేరుతో వెంటబడుతున్న ఆకతాయిని హెచ్చరించడానికి వెళ్లిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువతిని వేధించిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా  ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో పృథ్విరాజ్ అనే వ్యక్తి తల్లి, చెల్లితో కలిసి నివాసముంటున్నాడు. అయితే అదే ప్రాంతంలో నివాసముండే డేవిడ్ అనే ఆకతాయి నిత్యం పృథ్వి చెల్లిని ప్రేమ పేరుతో వేధించేవాడు. ఎన్ని సార్తు హెచ్చరించినా అతడి తీరు మార్చుకోలేదు. 

ఆదివారం రాత్రి డేవిడ్ ఫుల్లుగా మద్యం సేవించి వచ్చి పృథ్వి చెల్లితో పాటు తల్లిని కూడా దుర్భాషలాడు. ఆ సమయంలో కొడుకు ఇంట్లో లేకపోవడంతో వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని తల్లి అతడికి చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పృథ్వి అర్థరాత్రి సమయంలో డేవిడ్ ఇంటికి వెళ్లాడు.

ఈ క్రమంలో పృథ్వి, డేవిడ్ కు మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో విచక్షణను కోల్పోయిన డేవిడ్ ఇంట్లో నుండి ఓ పదునైన కత్తిని తెచ్చి పృథ్వి చాతిపై పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి 
కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నిందితుడు డేవిడ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.