రూ. 200 కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవ చివరికి దారుణ హత్యకు దారి తీసింది. ఈ ఘటన హైదరాబాద్, అఫ్జల్‌గంజ్‌ లో చోటు చేసుకుంది. ఫుట్ పాత్ మీద బతికే ఇద్దరు వ్యక్తుల మధ్య రూ. 200 కోసం ఘర్ణణ జరిగింది. మాటామాటా పెరగడంతో ఒకరి హత్యకు దారితీసింది.

నారాయణ్ పేట్ జిల్లా ముమ్మిడి గ్రామానికి చెందిన ఆశప్ప(55) బతుకు దెరువు కోసం 20 యేళ్ల కిందట నగరానికి వచ్చి గౌలిగూడ లేబర్ అడ్డా దగ్గర ఉంటున్నాడు. దొరికిన పని చేసుకుంటూ రాత్రిపూట ఫుట్ పాత్ మీద పడుకునేవాడు. 

అదే లేబర్ అడ్డా వద్ద కర్నూలు జిల్లా నందనవనం గ్రామానికి చెందిన బద్రి నాగేందర్ అలియాస్ పాములు(50) కూడా నిద్రపోతుండేవాడు. ఈ క్రమంలో గత సోమవారం రాత్రి నాగేందర్ జేబులో ఉన్న రూ. 200 ఎవరో కొట్టేశారు.

అర్థరాత్రి మెలుకువ వచ్చిన పాములు జేబులో చూసుకునేసరికి డబ్బులు కనిపించలేదు. దీంతో పక్కనే పడుకున్న ఆశప్ప మీద అనుమానపడ్డాడు. అంతటితో ఊరుకోకుండా గట్టిగట్టిగా తిట్టడం మొదలుపెట్టాడు. 

దీంతో మెలుకువ వచ్చిన ఆశప్ప.. నాగేందర్ తననే తిడుతున్నాడని గ్రహించి.. నన్నెందుకు తిడుతున్నావు.. డబ్బులు నేను తీయలేదు. నాకేం తెలీదు’ అని చెబుతున్నా వినలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది.

కోపోద్రిక్తుడైన బద్రి నాగేందర్ ఆశప్పను కొట్టి కింద పడేసి, తల మీద బండరాయితో మోదాడు. ఆశప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారమందుకున్న అఫ్జల్ గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బద్రి నాగేందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.