ప్రభుత్వాలు ఎన్ని శిక్షలు వేసినా... ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా... కామంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే... ఎన్నో ఘటనలు వెలుగులోకి రాగా... సోమవారం మరిన్ని దారుణ సంఘటనలు వెలుగుచూశాయి. 9నెలల గర్భిణీని కూడా ఓ కామాంధుడు వదలలేదు. ఇంకొకడు.. 8ఏళ్ల పసిదాన్ని చెరపట్టాడు. మరో ప్రాంతంలో పదేళ్ల పిల్లాడిపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌లో తొమ్మిది నెలల నిండు గర్భిణిపై ఓ కేబుల్‌ టీవీ వర్కర్‌ అత్యాచారం జరిపాడు. ఈ నెల 9న మధ్యాహ్నం డిష్‌ రిపేర్‌ చేయడానికి వచ్చిన కనపర్తి రామకృష్ణ ఇంట్లో ఒంటరిగా ఉన్న గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి భర్త సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ విషయం బయటికి పొక్కకుండా పంచాయతీ పెట్టి బాధితురాలి కుటుంబానికి డబ్బు ముట్టజెప్పేందుకు బేరం కుదిరినట్లు సమాచారం. 

నెల్లూరులో.. పెళ్లై ఏడాది కూతురున్న ఏకుల అజయ్‌ అనే యువకుడు ఓ బాలికను మాయమాటలతో వంచించాడు. ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్రంగా గర్భస్రావం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ఏపీలోని కుప్పంలో పదేళ్ల బాలికపై మైనర్‌ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పంజాబ్‌లోని బియాస్‌ ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ బడిలో పదో తరగతి బాలుడు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యూపీలో కాన్పూర్‌ దేహాత్‌ జిల్లాలో మైనర్‌పై యోగేంద్ర అనే యువకుడు తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెకు విషం తాగించి.. అతడు కూడా పురుగుల మందు తాగాడు. పోలీసులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఒడిసాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగింది. వీరిలో ఓ దివ్యాంగురాలు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న బాలికపై సుందరం అనే 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.