నారాయణఖేడ్: అనుమానం పెనుభూతమై వెంటాడగా ఓ వ్యక్తి తన భార్యను మట్టుబెట్టాడు. అంతకు అదే కారణంతో అత్తను కూడా చంపి జైలు శిక్ష అనుభవించాడు. నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ లో భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో దారుణానికి పాల్పడ్డాడు. భార్యను హత్య చేశాడు. 

ఆ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ సత్యనారాయణ రాజు మీడియా సమావేశంలో వెల్లడిందారు. అనంతసాగర్ కు చెందిన జుర్రు సాయిలు (46)కు 1996లో రేగోడు మండలం చౌదర్ పల్లికి చెందిన అనసూయ (40)తో పెళ్లయింది. భార్యపై అనుమానం ఉన్న విషయాన్ని సాయిలు గతంలో అనుసూయ తల్లి విరమ్మకు చెప్పాడు. ఆ సమయంలో అత్తకు, అల్లుడికి మధ్య గొడవ జరిగింది. 

ఆ సమయంలో రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ ఎంఐజీ కాలనీలో నివాసం ఉండే విఠమ్మను సాయిలు తన సోదరుడు రాములుతో కలిసి హత్య చేశాడు. ఈ కేసులో అతను అప్పట్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. కొంత కాలం క్రితం భార్య అనుసూయకు, అతనికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.

పెద్దల జోక్యంతో తిరిగి కాపురం కొంత కాలం సజావుగానే సాగింది. అయితే, అనుమానంతో భార్యను అతను నిత్యం వేధిస్తూ వచ్చాడు. దీంతో అనసూయ అతనితో విడిగా ఉంటూ వచ్చింది. నెల రోజుల క్రితం పెద్దలు జోక్యం చేసుకుని తిరిగి కలిపారు. ఈ సమయంలో భార్యతో అతను ప్రేమను నటిస్తూ వచ్చాడు. ఆమె పూర్తిగా నమ్మిందని భావించిన తర్వాత బుధవారం అర్థరాత్రి ఆమెను హత్యచేశాడు. 

భార్యను హత్య చేసి అతను పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు  చేశారు. స్కూటీని, హత్యకు వినియోగించిన చాకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జహీరాబాద్ కోర్టులో హాజరు పరిచారు.