మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహంపై డీజిల్ పోసి నిప్పు అంటించాడు. కాలిన మృదేహాన్ని మూటగట్టి ట్రాలీలో ఆటోలో తీసుకువెళ్లి అనంతగిరి అటవీ ప్రాంతంలోని వంతెన కింద పడేసి వచ్చాడు. ఆ తర్వాత తానేమీ ఎరనట్లు నటించడం మొదలుపెట్టాడు. తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ సంఘటన వికారాబాద్ లో చోటుచేసుకోగా... ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహ కల్ప సమీపంలో నివాసం ఉండే బానాల ప్రభుకు 2007లొ సంతోష(32) అనే యువతితో పెళ్లి జరిగింది. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు విజయ్, సన్నీ, జంపన్న కాగా.. కూతురు సారిక ఉంది. గాడిద పాలు అమ్ముకొని వీరు జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే.. ప్రభుకి ముందు నుంచి మద్యం సేవించే అలవాటు ఉంది.

విపరీతంగా మద్యం సేవించి.. భార్యతో తరచూ గొడవపడేవాడు. కాగా.. ఈ క్రమంలోనే ఈ నెల 11వ తేదీన భార్య తో గొడవపడ్డాడు. గొడవలో భాగంగానే ఆవేశంతో భార్యను కొట్టి చంపేశాడు. అనంతరం మృతదేహానికి డీజిల్ పోసి నిప్పు అంటించాడు. దానిని సంచిలో చుట్టి ట్రాలీ ఆటోలో బుగ్గ రామేశ్వరం మీదుగా కెరేళ్లి మార్గంలో ఉన్న లోతువాగు వంతెన కింద పడేశాడు.

మరుసటి రోజు పోలీసులకు తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు వెతికినా లభ్యం కాలేదు. దీంతో.. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.