కరోనా వైరస్ కారణంగా దేశంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రాణాలుకోల్పోతున్నారు. అయితే.. వైరస్ సోకిన తర్వాత కన్నా కూడా.. కోవిడ్ సోకుతేందేమో అనే భయంతోనే మరికొందరు మృత్యువాతపడుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ భయంతో చాలా మంది బలవన్మరణాలకు పాల్పడుతుండగా.. తాజాగా.. ఓ కుటుంబం బలయ్యింది. ఓ వ్యక్తి ఈ వైరస్ భయంతో భార్య, కూతురిని చంపేసి.. అనంతరం తాను కూడా ఆత్మహత్యచేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మహబూబ్ నగర్ జిల్లా దర్వాద్ ప్రాంతానికి చెందిన మౌనేష్ పట్టార్(36) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా... రోజూ కరోనా వైరస్ కి సంబంధించిన వార్తలు చదువుతూ మౌనేష్ చాలా ఒత్తిడిగి గురయ్యాడు. గత వారం రోజులుగా.. తనకు, తన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకుతుందేమోననే భయం అతనిలో మొదలైంది.

తమ సంస్థలో పనిచేసే దాదాపు 30మందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో.. తాను కూడా ఆ వైరస్ కి బలికావడం ఖాయమని భావించాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి భార్య అర్పిత(28), కూతురు సుకృతి(4) లకు విషం తాగించాడు. అనంతరం తాను కూడా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా.. చనిపోవడానికి ముందు ఓ సూసైడ్ నోట్ కూడా రాశాడు. తాను పనిచేసే సంస్థలో 30మందికి కరోనా సోకిందని అందులో రాశాడు. గత కొద్దిరోజులుగా తన కూతురి ఆరోగ్యం కూడా సరిగా లేదని.. అంతేకాకుండా తన భార్య ఆక్సీజన్ లెవల్స్ కూడా పడిపోయాయని పేర్కొన్నాడు. అందుకే తామంతా బలవన్మరణానికి పాల్పడినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.