హైదరాబాద్ సనత్‌నగర్‌లో దారుణం జరిగింది. భార్యను, కన్నబిడ్డను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి,. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని దేవారియాకు చెందిన రాజేశ్ ఉపాధి కోసం భార్య ఊర్మిళ, కొడుకుతో కలిసి 15 రోజుల క్రితమే నగరానికి వచ్చాడు.

ఉర్మిళ సోదరి, ఆమె భర్త కూడా దగ్గరలోనే ఉండటంతో సనత్‌నగర్‌లో కాపురం పెట్టాడు రాజేశ్. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ భార్య, కొడుకులు ఆదివారం మధ్యాహ్నం ఊర్మిళ సోదరి భర్త ఇంటికి రాగా.. తాళం వేసి ఉంది.

వెంటనే రాజేశ్‌కు ఫోన్ చేశాడు.. అతను దానికి స్పందించకపోవడంతో రెండు గంటల పాటు అక్కడే వేచి చూశాడు. ఎంతకు స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి డోర్ పగులగొట్టి చూడగా.. తల్లీకొడుకులు ఇంట్లో నిర్జీవంగా పడి ఉన్నారు.

ఊర్మిళను ఇనుప రాడ్డుతో కొట్టి.. నాలుగేళ్ల కొడుకును బకెట్‌లో ముంచి దారుణంగా హత్య చేశారు. దీంతో అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు.

రాజేశ్ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో అతనే ఈ హత్యలకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. కాగా రాజేశ్‌కు ఇది రెండో వివాహం.. ఏడేళ్ల క్రితం అతని మొదటి భార్య రాజేశ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రాజేశ్ కోసం గాలిస్తున్నారు.