హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఐడీఏ బొల్లారంలో నిద్రపోతున్న వ్యక్తిని బండరాయితో మోదీ చంపారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన గోవింద్ ఐడీఏ బొల్లారం బీసీ కాలనీలో భార్య కస్తూరి, కుమారుడు పెరుమాళ్లతో కలిసి రాయికొట్టి జీవిస్తున్నాడు.

వేసవి కావడంతో ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి ఇంటి బయట నిద్రపోయారు. సోమవారం తెల్లవారుజామున పెరుమాళ్లు లేచి మంచినీళ్లు త్రాగి నిద్రపోయాడు. కొద్దిసేపటికి పెద్ద శబ్ధం రావడంతో కస్తూరి లేచి చూసింది.

భర్త తలకు బలమైన గాయమై రక్తస్రావమవుతోంది. దీంతో వెంటనే 108కి సమాచారం అందించి.. ఆస్పత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు ధ్రువీకరించారు.

ఘటనాస్థలంలో పెద్ద బండరాయి ఉండటంతో పోలీసులు హత్యగా నిర్ధారించారు. కాగా మృతునికి బంధువులతో పాత కక్షలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అతడి భార్య చెల్లెలు కొడుకు సెల్వంకు తన కోడలని ఇచ్చి పెళ్లి చేస్తానని గతంలో గోవింద్ మాట ఇచ్చాడని, అయితే అతనితో కాకుండా కొడుకుతో వివాహం జరిపించాడు.

దీనిపై కక్ష పెంచుకున్న సెల్వం.. గోవింద్ కొడుకు పెరుమాళ్లుతో తరచూ గొడవ పడేవాడని సమాచారం. ఆదివారం సాయంత్రం కూడా సెల్వం.. పెరుమాళ్లుతో గొడవపడటంతో పెద్దలు సర్దిచెప్పారు.

నిద్రపోతున్న వ్యక్తిని పెరుమాళ్లుగా భ్రమపడిన సెల్వం... గోవింద్‌ను బండరాయితో బలంగా మోదీ చంపి ఉంటాడని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.