తన కూతురిని పట్టించుకోకుండా అల్లుడు.. పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అతనికి అనుమానం కలిగింది. తన కూతురి జీవితానికి అన్యాయం చేస్తాడా అంటూ కోపంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే ఆవేశంలో అల్లుడిని గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ దారుణ సంఘటన నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్‌ పంచాయతీ పరిధిలో గల సోమిడి ర్యాగడి తండా(ఎస్సార్‌ తండా)కు చెందిన గుగులావత్‌ శర్మన్‌ నాయక్‌(45) మెండోరా తండాలో ఉన్న తన బావమరిది భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు వదంతులున్నాయి. 

పద్ధతి మార్చుకోవాలని శర్మన్‌ నాయక్‌ను అతడి మామ హంత్యానాయక్‌ పలుమార్లు హెచ్చరించాడు. శర్మన్‌ వినకపోవడంతో సోమవారం తెల్లవారుజామున శర్మన్‌ నాయక్‌ ఇంటికొచ్చి మంచంపై నిద్రిస్తున్న అల్లుడిని గొడ్డలితో నరికి చంపాడు. శర్మన్‌ కేకలు విన్న కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు పట్టుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.