కుటుంబ కలహాలకు ఆ ఇంటి పెద్ద బలయ్యాడు. తాగిన మైకంలో కన్న కొడుకే తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన జగిత్యాలలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన చంద్రయ్యకు భార్య బిడ్డలు ఉన్నారు. కాగా... బుధవారం రాత్రి చంద్రయ్య కొడుకు మల్లేష్ పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. కాగా... ఏదో విషయంలో తండ్రి, కొడుకులకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన మల్లేష్...గొడ్డలితో తండ్రిని నరికేశాడు. దీంతో... తీవ్రగాయాలపాలైన చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా... కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.