రూ.3వేల కోసం ఓ వ్యక్తి తన స్నేహితుడిని అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటుచేసుకోగా.. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామానికి చెందిన బోయిని సత్తయ్య(40)కు, భార్యకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సత్తయ్య ఒంటరిగా కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. చేవెళ్ల మండలంలోని మాల్కాపూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో అతని సోదరుడు ఆంజనేయులు పనిచేస్తుండగా.. అప్పుడుప్పుడు వాళ్ల ఇంటికి వెళ్తుండేవాడు.

కాగా.. అదే గ్రామానికి చెందిన ఒగ్గు శివరాజు అలియాస్ బీర్ల శివ(23) తో సత్తయ్యకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి మద్యం సేవించేవారు. ఈ క్రమంలో ఆగస్టు 29వ తేదీన సాయంత్రం ఇద్దరూ కలిసి గ్రామంలోని కల్లు దుకాణానికి వెళ్లారు. కాగా.. అక్కడకు వెళ్లిన తర్వాత సత్తయ్య జేబులో డబ్బులు ఉండటాన్ని శివ గమనించాడు.

ఎలాగైనా ఆ డబ్బులు కాజేయాలని శివ భావించాడు. ఈ క్రమంలో సత్తయ్యను తీసుకొని మందు తాగుదామని చెప్పి ఓ ఖాళీ ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. సత్తయ్య మత్తులోకి జారిపోగానే.. దానిని అదునుగా తీసుకున్న శివ.. బండరాయితో తలపై మోది హత్య చేశాడు. అనంతరం సత్తయ్య జేబులోని డబ్బులు తీసుకొని పరారయ్యాడు.

మరుసటి రోజు గుర్తుతెలియని శవం కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమేరాను పరిశీలించగా.. అసలు విషయం తెలిసింది. శివను అదుపులోకి తీసుకొని విచారిచంగా.. డబ్బుకోసమే తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.